ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో విజయవాడలో పనిచేసిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం. సత్యనారాయణ లను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. జనరల్ ట్రాన్స్ఫర్ లో భాగంగా హనుమంతరావు కాకినాడ డిఎస్పీగా బదిలీ అయ్యారు. అయినప్పటికీ కాదంబరి పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో ప్రత్యేకంగా విజయవాడకు వచ్చి మరి ఈ కేసు విచారణలో జోక్యం చేసుకున్నారు. మరోవైపు సీఐ సత్యనారాయణ కేసు విచారణ పూర్తికాకుండానే రిపోర్టు అందించారు. ఉన్నతాధికారులు చెప్పారంటూ ఆమెను అరెస్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అన్నీ తామై వ్యవహరించిన ఐపీఎస్ లు పి. సీతారామాంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని లపైనా చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సిద్ధమైంది.
మరోవైపు తనను బెదిరించి ఫోర్జరీ కేసులో ఇరికించి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతిరాణా, కుక్కల విద్యాసాగర్ లపై చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కాదంబరి ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్ తో కుమ్మక్కై ఐపిఎస్ లు తనను ఇబ్బందులకు గురి చేశారంటూ శుక్రవారం ఆమె కంప్లైంట్ ఇచ్చారు. విద్యాసాగర్ ప్రమేయంతో తనని, తన కుటుంబాన్ని వేధించి మరీ ముంబయి లో అరెస్టు చేశారని, చేయని తప్పుకు 42 రోజులపాటు జైల్లో ఉండేలా చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులందరూ తన పట్ల దురుసుగా ప్రవర్తించి, అర్ధరాత్రి కూడా ఇంటరాగేషన్ పేరుతో వేధించారని ఆమె ఆరోపించారు. నిబంధనల ప్రకారం తన లాయర్ తో కలిసి ఇబ్రహీంపట్నం ఎస్ హెచ్ఓ కు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు.