గుడివాడలో ఏదో జరుగుతోంది. అధికార వైసీపీ ఎందుకో కంగారు పడుతోంది. లేకపోతే, గుడివాడలోకి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల్ని ప్రవేశించనివ్వట్లేదు. తాజాగా బీజేపీ నేతలనూ పోలీసులు అడ్డకుంటున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలని తమను అడ్డుకున్న టీడీపీ నేతలు ఆరోపించినట్టే, తాజాగా బీజేపీ నేతలూ ఆరోపించారు.
గుడివాడ వేదికగా ‘కాసినో’ నిర్వహణ జరిగినట్లు, ‘ఏసెస్ కాసినో’ సంస్థ అధికారికంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. కానీ, గుడివాడలో కాసినో జరగలేదని వైసీపీ ప్రభుత్వం కుండబద్దలుగొట్టేస్తోంది. ఇంకోపక్క, ‘కాసినో నిర్వహణ జరగలేదుగానీ.. కోడి పందాలు జరిగాయి.. కోడిపందాలంటే, దాంతోపాటుగా జూదం కూడా వుంటుంది కదా.. అమ్మాయిలతో అసభ్య నృత్యాలు మాత్రం చేయించలేదు..’ అని టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెబుతున్నారు.
ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, కొడాలి నాని కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో, కోడి పందాల నిర్వాహకులు తనను కలిశారనీ, తన సాయం కోరారనీ, వారు తన స్నేహితులేనని గత ఐదేళ్ళుగా గుడివాడలో ఈ వ్యవహారం నడుస్తోందనీ వల్లభనేని వంశీ చెప్పడం.
ఇంకోపక్క, ఇదే కాసినో వేదికగా అసభ్యకర నృత్యాలు జరిగాయన్న సమాచారం రావడంతో, తానే పోలీసులకు సమాచారం ఇచ్చానని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. తనకు ఆ కాసినో నిర్వహణతో సంబంధం లేదంటున్నారు. తనకు చెందిన కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఎలాంటి కాసినోల నిర్వహణా జరగలేదని కుండబద్దలుగొట్టేస్తున్నారు.
మొత్తమ్మీద కథ రంజుగా సాగుతోంది. కాసినో నిర్వహణ జరిగిందనే విషయం తేలిపోయింది. అయినా, పోలీసులు పట్టించుకోకపోవడమేంటి.? పైగా, కాసినో నిర్వహణపై ప్రశ్నించిన నేతల మీద కేసులు పెట్టడం.. అసలు గుడివాడకూ విపక్షాలకు చెందిన నేతల్ని రానివ్వకపోవడం.. ఇదంతా చాలా అనుమానాలకు తావిస్తోంది.