గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల కథానాయికగా నటించింది. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించారు. సినిమా విడుదల జూలై 18నగా ఖరారైంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ కిరీటి చిన్నప్పటి నుంచి పరిచయం ఉందన్నారు. జూనియర్ టీజర్, ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయని, కిరీటి డాన్స్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడని ప్రశంసించారు. అతని రూపంలో కొత్తగా ఒక మంచి స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడని అన్నారు. శ్రీలీలతో కిరీటి కెమిస్ట్రీ బాగుందని, జెనీలియా మంచి నటీమణిగా ఈ సినిమాలో బలమైన పాత్ర చేశారని పేర్కొన్నారు. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పనితీరును ప్రశంసిస్తూ సినిమాకు తాను ఆశీర్వాదాలు తెలుపుతూ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.
కిరీటి తండ్రి గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, తన కుమారుడికి చిన్నప్పటినుంచి యాక్టింగ్, డాన్సింగ్ అంటే ఆసక్తి ఉందన్నారు. ఈ సినిమాలో రవిచంద్రన్, జెనీలియా పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు. బాహుబలి వంటి సినిమాలకు పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమాకూ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కిరీటికి అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు.
నటుడు రవిచంద్రన్ మాట్లాడుతూ, ఈ సినిమా తండ్రి-కొడుకు అనుబంధం చుట్టూ తిరుగుతుందని, తాను పోషించిన పాత్ర చాలా భావోద్వేగంతో కూడినదని అన్నారు. జూనియర్ సినిమా ఎమోషనల్‌గా, హృదయాన్ని తాకేలా ఉంటుందని తెలిపారు.
కిరీటి మాట్లాడుతూ, తనకు సినిమాల్లోకి రావడానికి శివన్న, అప్పు గారే ఇన్‌స్పిరేషన్ అన్నారు. రాధాకృష్ణ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ విజువల్స్ ఈ సినిమాకి పెద్ద బలమన్నారు. శ్రీలీలతో కలిసి పని చేయడం గొప్ప అనుభవమన్నారు. తండ్రి చేసిన త్యాగాల్ని గుర్తుచేసుకుంటూ, ప్రేక్షకుల ఆశీర్వాదాలతో ఈ సినిమా విజయవంతం కావాలని కోరారు.
శ్రీలీల మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ జర్నీ తనకు చాలా వండర్ఫుల్ అనుభవంగా చెప్పారు. దర్శకుడు రాధాకృష్ణ విజన్, నిర్మాత సాయి గారి డెడికేషన్‌ను కొనియాడారు. జెనీలియా, రవిచంద్రన్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు.
జెనీలియా మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా తాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. కిరీటి, శ్రీలీల ఇద్దరూ న్యూకమర్స్‌గా కాకుండా ఎక్సపీరియన్స్ ఉన్నవారిలా పనిచేశారని ప్రశంసించారు. సినిమా చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్నారు.
డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ, కిరీటి ఎంతో టాలెంటెడ్, హార్డ్ వర్కింగ్ నటుడు అన్నారు. ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయన్నారు. రాధాకృష్ణ చెప్పిన కథ తనకు చాలా నచ్చిందని తెలిపారు.
మొత్తంగా ‘జూనియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో సందడిగా జరిగింది. జూలై 18న విడుదలవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
