Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతుంటారు. ఇంటర్వ్యూలో, వేడుకల్లో సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం చాలా అరుదు. అలాంటి తారక్ ఈమధ్య ఓ మ్యాగజైన్ తో తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా లో నా ఎంట్రీ సీన్ చూసి మా అమ్మ కన్నీరు పెట్టుకుంది. నన్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది. నా జీవితంలో అదొక మర్చిపోలేని అనుభూతి. ఇక నా కొడుకుల విషయానికొస్తే పెద్దకొడుకు అభయ్ రామ్ పదేపదే ప్రశ్నలు వేస్తుంటాడు. నేను, నా భార్య ప్రణతి అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్తుంటాం. ఒక్కోసారి వాడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. ఇక నాకు వ్యక్తిగతంగా ఆడపిల్లలంటే చాలా ఇష్టం. రెండోసారైనా అమ్మాయి పుడుతుందని ఎంతగానో ఎదురు చూశాను. భార్గవ్ పుట్టాడు. నా కోరిక తీరలేదు. అందుకే ఆడపిల్లల తల్లిదండ్రులను చూస్తే ఈర్ష్య గా ఉంటుంది. ఎవరికి తలవంచోద్దని ఎక్కడా చేయి చాచొద్దని చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు ఇప్పటికే అనుసరిస్తా. ప్రణతి నన్ను ఎంతగానో మార్చేసింది. కాబట్టి అమ్మను, నా భార్యను ఎంతగానో గౌరవిస్తా’ అని చెప్పుకొచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణం గురించి మాట్లాడుతూ ‘ ఈ చిత్ర షూటింగ్ నాకు మర్చిపోలేని అనుభూతి మిగిల్చింది. ఈ సినిమాలో నేను, చరణ్ ఒకటే స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళం. అందుకుగాను రోజుకు 7 సార్లు తినేవాడ్ని. ‘నాటు నాటు’ పాట విషయానికి వస్తే ఆ పాట కోసం రోజు మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసే వాళ్ళం. బాగా అలసిపోయి పడుకుంటే కలలోకి కూడా ఆ స్టెప్పులే వచ్చేవి’అని చెప్పారు.
తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. ‘ఒక్క సినిమా చేస్తే చాలనుకున్నా. రెండో సినిమా గురించి ఆలోచన చేయలేదు. అలాంటిది 30 సినిమాల వరకు రాగలిగాను. ఏదో సాధించాలనే తపన లేదు. ఉన్నంతలో సంతోషంగా బతికేయడమే నాకు తెలిసింది. నాకు డాన్స్ సంగీతం అంటే చాలా ఇష్టం. ఖాళీగా ఉన్నప్పుడు పాటలు వింటుంటా. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన పాట ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలోని ‘ఆశా పాశం’. ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో గుర్తులేదు. అందులో చాలా లోతైన అర్థం ఉంది’ అని ముగించారు.