కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అయితే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ” ఏపీ గ్రోత్ స్టోరీస్ ఇన్ దావోస్-2025″ పై ప్రచారం కల్పించేందుకుగాను ఏపీ ప్రభుత్వం నేషనల్ ఛానల్ ఎన్డి టీవీ, ఎన్డీటీవీ ప్రాఫిట్ చానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఇందుకుగాను ఏపీ ప్రభుత్వం ఆ ఛానల్ కు రూ. 74.34 లక్షలు ( జీఎస్టీ తో సహా) చెల్లించేందుకు నిధులు విడుదల చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ప్రజల సొమ్మును ఖర్చు పడుతోందని కొందరు ఆరోపించారు.
పబ్లిసిటీ పిచ్చితో ఏపీ ప్రభుత్వం రూ. 75 కోట్ల రూపాయలు ఎన్డిటీవీకి చెల్లించిందని సాయి అనే సీనియర్ జర్నలిస్ట్ తన యూట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతోపాటు వివాదాస్పదమయ్యాయి. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఎన్డి టీవీకి నిధుల చెల్లింపు విషయంలో క్లారిటీ ఇచ్చింది. జీఎస్టీ తో సహా ఆ ఛానల్ కు రూ 74.34 లక్షలు మాత్రమే చెల్లించామని అందుకు సంబంధించిన జీవోను బయటపెట్టింది. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సు నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను రాబట్టుకునేందుకుగాను ఇక్కడి ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, వసతుల అభివృద్ధి, శ్రామిక శక్తి గురించి ప్రచారం చేయించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ వివరణపై స్పందించిన సీనియర్ జర్నలిస్ట్ సాయి క్షమాపణలు చెప్పారు. దావోస్ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఖర్చును తాను తప్పుగా చెప్పినట్లు సాయి తెలిపారు. ప్రభుత్వ జీవోను సరిగా చదవకపోవడం వల్ల పొరపాటు జరిగిందని ఆయన తెలిపారు. తాను చెప్పినట్లు ప్రకటన ఖర్చు రూ. 75 కోట్లు కాదని రూ.74 లక్షలని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు.