చిరంజీవి గారిని చూస్తే బాధేసింది. ఆయన మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడాలా..? అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదు’.
‘చిరంజీవికేం తక్కువ.. కిందిస్థాయి నుంచి స్వయంకృషితో పైకొచ్చిన వ్యక్తి.. తనను పైకి తీసుకొచ్చిన ఇండస్ట్రీ కోసం తపన పడుతున్నారు. ఆయన పరిస్థితి ఎవరికీ రావొద్దు. పవన్ కల్యాణ్ పై కక్ష సాధించుకోవడం ద్వారా సాధించేది ఏంటి..? ఆయన రెమ్యునరేషన్ ఆయనకు వస్తుంది. ధియేటర్ దగ్గర పల్లీలు అమ్మేవారి దగ్గర నుంచి లైట్ బాయ్స్ వరకూ నష్టపోతారు’.
‘ప్రతి ఒక్కరికీ ఇగో ఉంటుంది. పవన్ కీ ఉంటుంది. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ.. సినీ పరిశ్రమను నాశనం చేయకూడదు. పరిశ్రమపై ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకపోతే.. ఏపీలో షూటింగ్ లు కూడా చేయరు. రాష్ట్రానికి ఇది మంచిది కాదు’ అని అన్నారు.