వైఎస్ షర్మిల తెలుగు దేశం పార్టీలో చేరబోతోందట.. అంటూ వైసీపీ శ్రేణులు చూస్తున్న ప్రచారాన్ని చూస్తూనే వున్నాం. ఇంతలోనే వైఎస్ విజయమ్మ, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో భేటీ అయిన వైనానికి సంబంధించి ఓ ఫొటో వెలుగు చూసింది.
టీడీపీలో చేరేందుకే విజయమ్మ, జేసీ ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా గగ్గోలు పెట్టాయి. గత కొంతకాలంగా వైఎస్ షర్మిలనీ, వైఎస్ విజయమ్మనీ.. నానా రకాలుగా తూలనాడుతున్నాయి వైసీపీ శ్రేణులు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకాన్ని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. కడపలో షర్మిల పోటీ చేయడం, ఆమెకు విజయమ్మ మద్దతు తెలిపిన దరమిలా, ‘షర్మిల అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు’ అని వైసీపీ నేతలే తూలనాడటం చూశాం.
విజయమ్మ – జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడం కాదు, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో వైసీపీ మద్దతుదారుల నుంచి ట్రోలింగ్‌కి గురవుతోంది. మహిళలకు వైసీపీ ఇచ్చే గౌరవం ఏంటో ఈ ట్రోలింగుని చూస్తేనే అర్థమవుతుంది.
విజయమ్మ అంటే వైఎస్ జగన్‌కి జన్మనిచ్చిన తల్లి అనీ, వైఎస్ షర్మిల అంటే వైఎస్ జగన్‌కి తోడబుట్టిన చెల్లి అనీ వైసీపీ శ్రేణులు మర్చిపోయాయ్. అంతలా విషాన్ని నింపేసుకున్నాయి వైసీపీ శ్రేణులు ఈ ఇద్దరి మీదా.
ఇంతకీ విజయమ్మ – జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ వెనుక అసలు కథేంటి.? అంటే, భేటీ లేదు.. ఇంకేమీ లేదు.. అనారోగ్య సమస్యల రీత్యా, ఓ ఆసుపత్రికి విజయమ్మ వెళితే, అదే ఆసుపత్రికి అనారోగ్య సమస్యతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళారట. ఇద్దరూ అలా ఆసుపత్రి లాంజ్‌లో కలుసుకోవడం జరిగిందట.
అక్కడ విజయమ్మని చూసి మర్యాదపూర్వకంగా పలకరించారట జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇంతే, ఇంతకు మించి అక్కడ జరిగిందేమీ లేదు. ఇందులో రాజకీయం అసలే లేదు.!