Janasenani Pawankalyan: ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళతాం. నాతోపాటు పోటీలో నిలబడ్డ అభ్యర్థులంతా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి తీరతాం. ఓటుని మాత్రం కరెన్సీ నోట్లతో కొనబోం. మా కోసం కాదు.. మీ పిల్లల భవిష్యత్తు కోసం జనసేన పార్టీకి అధికారమివ్వండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘పరివర్తన’ కోణంలోనే జనసేన 10వ ఆవిర్భావ సభ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘కొందరు వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేసిన గోబెల్స్‌కి ఏమయ్యిందో తెలుసా.? దారుణమైన చావు చచ్చాడు. అలాంటి దుస్థితి వైసీపీ గోబెల్స్‌కి రావొచ్చు..’ అంటూ తన మీద దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల్ని హెచ్చరించారు జనసేన అధినేత.
‘దమ్ముంటే.. మగాడివైతే.. అంటూ కొందరు వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు.. మా దమ్ము, మగతనంతో వాళ్ళకేంటి పని.. దుర్యోధనుడు కూడా తొడలు కొట్టాడు.. ఆ తొడల్ని బద్దలుగొట్టాడు భీముడు.. వైసీపీలో తొడలు కొడుతున్న నేతలకీ అదే పరిస్థితి రాబోతోంది..’ అని జనసేన అధినేత అల్టిమేటం జారీ చేశారు.
‘మా బలం ఏంటో మాకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. వచ్చే రిపోర్టుల్ని బట్టి మా రాజకీయ వ్యూహాలుంటాయ్. ఒంటరిగా వెళ్ళాలా.? పొత్తు పెట్టుకోవాలా.? అన్నది ప్రజలే, ఆ రిపోర్ట్ ద్వారా మాకు తెలియజేస్తారు.. ఆ తర్వాత మా వ్యూహాలు మాకుంటాయ్..’ అని చెప్పారు జనసేన అధినేత.
‘రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను ప్రస్తుతం చేస్తున్న సినిమాకి. 22 నుంచి 25 రోజుల కాల్షీట్లు ఇచ్చాను. డబ్బుతో నాకు సమస్య ఏముంది.? వెయ్యి కోట్లకు అమ్ముడుపోతానని ఎలా అనుకుంటున్నారు.? 10 వేల కోట్లు అనే మాట చెబితే, నమ్మదగ్గది కాకపోయినా వినడానికి బావుంటుంది..’ అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
‘జనసైనికుల్ని, వీరమహిళల్ని, నన్ను డబ్బుతో కొనగలరా.? సాధ్యమయ్యే పని కాదు. ఏవేవో దుష్ప్రచారాలు జరుగుతుంటాయి. జనాన్ని పక్కదారి పట్టించేందుకు చేసే ప్రయత్నాలవి..’ అంటూ జనసేనాని చెప్పుకొచ్చారు. ‘నేను చెప్పిన రోడ్ మ్యాప్‌కి బీజేపీ సహకరించి వుంటే, అధికారంలోకి వచ్చేంత బలంగా టీడీపీ – జనసే కూటమి వుండేది. అప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవడమన్న సమస్య వచ్చేది కాదు.. టీడీపీ ప్రస్తావనే వుండేది కాదు..’ అని జనసేనాని వ్యాఖ్యానించడం గమనార్హం.
‘మద్యపాన నిషేధమంటే నమ్మారు.. సీపీఎస్ రద్దు అంటే నమ్మారు.. వైసీపీని గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ప్రభుత్వాన్ని నిలదీయడానికెందుకు భయం.? ప్రజలు నిలదీయకపోతే ఎలా.? రేప్పొద్దున్న జనసేన అధికారంలోకి వచ్చాక అయినా జనం మా తరఫున తప్పులుంటే నిలదీయాలి..’ అని జనసేనాని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలకు ఎలాంటి సమస్యలూ వుండవనీ, నేను బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్, వైసీపీ నేతలు ఢిల్లీలో వంగి వంగి చేస్తున్నదేంటో మైనార్టీ సోదరులు గుర్తించాలని కోరారు.
‘కాపు సామాజిక వర్గం బీసీల్ని కలుపుకుపోవాలి.. కమ్మ సామాజిక వర్గాన్ని శతృవుగా చూడాల్సిన పనిలేదు.. రెడ్డి సామాజిక వర్గంపై అక్కసు పెంచుకోవాల్సిన అవసరమే లేదు.. అందరం కలిస్తేనే సమాజం.. అధికారం అందరికీ దక్కాలి..’ అని నినదించారు పవన్ కళ్యాణ్.
వారాహి వాహనంపై రోడ్ షో సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు.. దారి పొడవునా స్ట్రీట్ లైట్స్‌ని కుట్రపూరితంగా అధికార పార్టీ ఆపేయించడంతో మచిలీపట్నం సభకు జనసేనాని ఆలస్యంగా వచ్చారు. అంత ఆలస్యమైనా.. సభా ప్రాంగణం నుంచి ఒక్కరంటే ఒక్కరూ వెనుదిరగకపోవడం గమనార్హం.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో సమస్యలున్నాయనీ, రాష్ట్రంలో బలపడేందుకు అదే సమస్యగా మారిందని జనసేనాని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
ఆద్యంతం పవన్ కళ్యాణ్ ప్రసంగం అత్యంత హుందాగా సాగింది. ఎక్కడా వైసీపీ నాయకుల పేర్లను జనసేనాని ప్రస్తావించలేదు. తనపై వైసీపీ నేతలు చేసే విమర్శలకు ఇంకోసారి సరైన సమాధానం చెబుతానన్న జనసేనాని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుని పలు సార్లు ప్రస్తావించారు.
‘ముఖ్యమంత్రి గనకనే గతంలో చంద్రబాబుని గౌరవించాం.. అదే గౌరవం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ ఇస్తున్నాం.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సమయంలో ప్రభుత్వానికి మద్దతిచ్చాం..’ అని చెప్పుకొచ్చారు.
164724 118716I like the helpful details you offer in your articles. Ill bookmark your weblog and check again here regularly. Im quite certain I will learn lots of new stuff right here! Finest of luck for the next! 612170