తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ కొంత భావోద్వేగానికి గురయ్యారు.
చిన్నప్పటి తన అనారోగ్య సమస్యల గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించీ పేర్కొన్నారు.
చదువు గురించీ, తనకు చిన్నప్పుడు వుండే భయాల గురించీ, సినిమాల గురించీ.. ఇలా చాలా విషయాల్ని జనసైనికులతో, రాష్ట్ర ప్రజలతో, తెలుగు ప్రజలతో పంచుకున్నారు పవన్ కళ్యాణ్.
తమిళంలోనూ, కన్నడలోనూ, హిందీలోనూ, మరాఠాలోనూ..
ఇలా పలు భాషల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తమిళ, కన్నడ, మరాఠీ ప్రజల్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్, పిఠాపురం వేదికగా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పెద్ద లక్ష్యాలు అందరికీ స్పష్టంగా అర్థమయ్యాయి.
సనాతన ధర్మం అనే భావన తనకు చిన్నప్పటినుంచీ వుందనీ, ఈ విషయమై ఎవరో తనను నిలదీసేంత సీన్ లేదని, వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు అస్సలు లేదనీ పవన్ కళ్యాణ్ చెప్పడం గమానార్హం. అలాగే, చేగువేరా గురించి తనను కామెంట్ చేసేవాళ్ళకీ పవన్ కళ్యాణ్ గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
గొప్ప వ్యక్తుల నుంచి గొప్ప గొప్ప భావాల్నీ, అందులోని మానవత్వాన్నీ తాను ఆకళింపు చేసుకుంటానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇందులో తప్పేముందని, జయకేతనం సభ ద్వారా, కొందర్ని సూటిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఎక్కువ భాషలు నేర్చుకోవడం మంచి విషయమేనని చెబుతూ, హిందీ వద్దని తమిళనాడులో అనడం అసంబద్ధమని కుండబద్దలుగొట్టేశారు. తమిళ సినిమాలకు హిందీ బెల్ట్ నుంచి ఆదాయం రావాలనుకుంటున్నప్పుడు, హిందీ భాష ఎందుకు వద్దని పవన్ కళ్యాణ్, తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలకి ఝలక్ ఇచ్చారు.
ద్రవిడ ఫార్ములా రూపకర్త పెరియార్ గురించీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జనసేనాని, ఆయన తెలుగు వాడంటూ సంచలన ప్రకటన చేయడం గమనార్హం. టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి చేస్తున్న ప్రయాణంలో, జనసైనికులు అత్యంత బాధ్యతగా వుండాలని జనసేనాని గుర్తు చేశారు.
‘మన లక్ష్యాలు పెద్దవి. రాష్ట్రం దాటి, జాతీయ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీదనే వుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 100 మంది మెరికల్లాంటి యువకుల్ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్ళడం జనసేన లక్ష్యం’ అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.