జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పర్యటనల నిమిత్తం ‘వారాహి’ అనే వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు.
పాదయాత్రలకు ఎలా పేర్లు పెడుతుంటారో, రాజకీయ నాయకులు తమ ప్రచార వాహనాలకి కూడా పేర్లు పెట్టుకుంటుంటారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ఎన్నికల ప్రచారం నిమిత్తం వినియోగించే వాహనాలకు సంబంధించి, అందులో కొన్ని ప్రత్యేక సౌకర్యాలూ ఏర్పాటు చేసుకుంటుంటారు.
పలు ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు, అప్పటికప్పుడు అక్కడ సరైన వసతులు వుండవు గనుక, తగిన సమయమూ వుండదు గనుక.. కాస్సేపు సేద తీరడానికి ఈ ప్రచార వాహనాల్లోనే ప్రత్యేక సౌకర్యాలు తప్పవు. లైటింగ్, సౌండ్.. ఇలా అన్నిటికి సంబంధించిన ఏర్పాట్లూ ఆయా వాహనాల్లో చేసుకోవడం మామూలే.
సో, పవన్ కళ్యాణ్ ‘వారాహి’ని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదు. కానీ, ‘వారాహి’ అంటేనే, అధికార పార్టీ వణికిపోయే పరిస్థితి వచ్చింది. సాధారణ వైసీపీ నేతల దగ్గర్నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం ‘వారాహి’ పేరు చెబితే కంగారు పడిపోయారు. మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెట్టారు.
కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్, పార్టీ కోసం కొనుగోలు చేసిన ‘స్కార్పియో’ వాహనాల విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది. అది వేరే వ్యవహారం. ‘వారాహి’ విషయంలో మరింతగా వైసీపీ అక్కసు కనిపించింది. ఇదే ‘వారాహి’కి అనూహ్యమైన రీతిలో ప్రచారం కల్పించిందన్నమాట.
వాహనంలో ప్రత్యేకతల విషయానికొస్తే, కాస్సేపు సేద తీరడానికి మాత్రమే కాదు, నలుగురైదుగురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకోవడానికీ సమావేశ మందిరం తరహా ఏర్పాట్లున్నాయి. అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ.. అప్పటికప్పుడు తాత్కాలిక సభ (రోడ్ షో సందర్భంగా కరెంటు పోతే) లాంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఇందులో వుంది.
చాలా దూరం వరకూ ప్రసంగాలు వినిపించేలా ఆడియో వ్యవస్థని ఈ ‘వారాహి’లో పొందుపర్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు పవన కోసం వస్తారు గనుక, చాలా బలంగా దీన్ని తీర్చిదిద్దాల్సి వచ్చింది. ఈ ప్రత్యేకతల్ని మించి వైసీపీ అక్కసు అనే ప్రత్యకత, ‘వారాహి’ వాహనానికి చాలా చాలా క్రేజ్ తెచ్చిపెట్టింది.
కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం పవన్ కళ్యాణ్ ఈ ‘వారాహి’ వాహనాన్ని వినియోగించడం మొదలు పెడతారు.