జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని జనసైనికులు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సభలో పవన్ స్పీచ్ కోసం జనసైనికులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఐతే వారు అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ స్పీచ్ అదిరిపోయింది. ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. అంటూ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ డైలాగ్ ఏదైతే ఉందో నేటి స్పీచ్ లో కూడా ఆ డైలాగ్ తో మొదలు పెట్టారు జననేత పవన్ కళ్యాణ్.
స్పీచ్ లో భాగంగా ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని. మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం.. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని అన్నారు పవన్ కళ్యాణ్. 2019 లో మనం ఓడిపోయినప్పుడు కొందరు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు. జనసేన ఆడపడచులను అవమానించారు. న్యాయం అడిగిన ప్రజలు, మహిళలపై కేసులు పెట్టారు. నాలుగు దశాబ్దాల సుధీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైలుకి పంపించారు. తనని అణచివేయాలని కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ లు చేశారు.
ఐతే ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో.. ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్ లో అడుగు పెట్టామని అన్నారు పవన్ కళ్యాణ్. దేశమంతా కూడా మనవైపు చూసేలా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాం.. భయం లేదు కాబట్టే ఇంత దూరం వచ్చా.. గుండె ధైర్యమే కవచం అని పవన్ అన్నారు.
ఇదే క్రమంలో జనసేన జన్మస్థలం తెలంగాణ. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడని అన్నారు పవన్ కళ్యాణ్. భారతదేశానికి బహుభాషలే మంచిది.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్.
సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడొద్దు.. ఎందుకంటే జనసైనికులంతా ప్రాణాలకు తెగించి వచ్చారు. 450 మంది జన సైనికులు సినిమాలు చూసి కాదు సిద్ధాంతాలను నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం సినిమాల గురించి మాట్లాడొద్దని అన్నారు పవన్ కళ్యాణ్.
తాను అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లు పార్టీని నడిపించా.. పార్టీ 11వ సంవత్సరం వాళ్లను 11 సీట్లకే పరిమితం చేశాం. తనకు సినిమాలు కేవలం రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉపకరణం మాత్రమే అని అన్నారు పవన్ కళ్యాణ్. ఖుషి సినిమా చూసి గద్దరన్న తనని ప్రోత్సహించారని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారని అన్నారు పవన్ కళ్యాణ్.
తనకు సగటు మధ్య తరగతి మనిషిగా జీవించాలనే కోరిక ఉండేది. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు ఇంట్లో తనని పెంచారని.. అలాంటిది నేను సినిమాలు చేస్తా.. రాజకీయాల్లోకి వస్తానని ఎవరు ఊహించలేదని అన్నారు పవన్ కళ్యాణ్. మా నాన్నకు నేను డిగ్రీ చేసి ఎస్.ఐ ని కావాలని ఉండేది.. బయటకు వెళ్తే ఏమవుతానో అని భయపడేవారని అన్నారు పవన్ కళ్యాణ్.