ఐదేళ్ళ క్రిందట, ‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు.. రాజకీయాలు చేయడమిక వేస్ట్..’ అంటూ ఆయన మీద చాలా చాలా విమర్శలు రావడం చూశాం. కట్ చేస్తే, ఐదేళ్ళ తర్వాత, 100 శాతం స్ట్రైక్ రేట్‌తో తన పార్టీ గురించీ, తన గురించీ జాతీయ స్థాయిలో అందరూ చర్చించుకునేలా చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
‘మనం ఓడిపోయాం.. రెండు చోట్లా పోటీ చేసిన నేనే ఓడిపోయాను. నేను పవర్ స్టార్‌ని కాదు. నన్నలా పిలవకండి..’ అని అభిమానులకి చెప్పేవారు పవన్ కళ్యాణ్ అప్పట్లో. కానీ, ‘పొలిటికల్ పవర్ స్టార్’ అని నేషనల్ మీడియా ఇప్పుడాయనకు కితాబులిస్తోంది.
సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అది మళ్ళీ వేరే చర్చ.! కానీ, గెలిచాక పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? అన్నదే అసలు చర్చ. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి, క్షణం తీరిక లేకుండా కష్టపడి పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఓ వైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కొనసాగిస్తూనే, ఇంకో వైపు ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు.. అదీ ఈ మధ్యనే పునఃప్రారంభమైంది. వీటితోపాటు, సినీ నటుడిగా తనకి తెలిసిన సేవా కార్యక్రమాలూ ఆయన కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ఆరు కోట్ల రూపాయల విరాళాన్ని ఆయన అందించిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా, ఎవరైనా ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తే, ఎప్పటికప్పుడు వాటి పరిష్కారం కోసం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. మరి, పార్టీ వ్యవహారాలకు తీరిక ఎక్కడిది.? సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను ఈ సమయంలో భుజానికెత్తుకోవడం అంత తేలిక కాదు కదా..?
పార్టీకి సంబంధించి ఎక్కడన్నా ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా, వెంటనే దాన్ని పరిష్కరించడంలోనూ జనసేనాని ముందుంటున్నారు. కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ వివాదంలో ఇరుక్కున్నప్పుడు జనసేనాని స్పందించిన తీరే ఇందకు నిదర్శనం. తప్పు ఎమ్మెల్యే వైపు నుంచి జరగడంతో, క్షమాపణ చెప్పించి, ప్రాయిశ్చిత్త దీక్ష కూడా చేయించారు జనసేనాని.
ఇంకోపక్క, తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యతను భుజానికెత్తుకున్నారు పవన్ కళ్యాణ్. నిజానికి, ఎన్నో ఏళ్ళుగా సనాతన ధర్మ పరిరక్షణపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే వున్నారు. కాకపోతే, పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్ అయ్యాక, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నినదిస్తున్న సనాతన ధర్మ పరిరక్షణకు దేశవ్యాప్తంగా అనూహ్యమైన మద్దతు లభిస్తోందిప్పుడు.
ఇటీవల తిరుపతి వెళ్ళిన జనసేన అలిపిరి నుంచి తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్ళి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, వెన్ను నొప్పితో పవన్ కళ్యాణ్ బాధపడ్డారప్పుడు. విజయవాడ వరదల సమయంలోనూ తీవ్ర జ్వరంతోనే క్షణం తీరిక లేకుండా, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వరద బాధితులకు సహాయక చర్యలు సకాలంలో అందేలా చేశారు.
నిజానికి, పవన్ కళ్యాణ్ చేస్తున్న మల్టీ-టాస్కింగ్ మామూలు విషయం కాదు. పొరుగు రాష్ట్రాలతో అటవీ శాఖకు సంబంధించిన వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండడం, ఆ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తుండడం.. ఇది కూడా ప్రస్తావనార్హమే. ఇంతా చేస్తున్నా ట్రోలింగ్ మాత్రం యధాతథం.!