100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడంతో ఏకంగా భారత రాజకీయాల్లోనే పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్, పార్టీ బలోపేతంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా వున్న పవన్ కళ్యాణ్, ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
జనసేనాని ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టేందుకు సిద్ధమైన జనసేన పార్టీ ముఖ్య నేతలు, ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే, తెలంగాణ రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేయాలని జనసేన భావిస్తోంది. ప్రధానంగా, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో జనసేన బలోపేతం దిశగా జనసేనాని వ్యూహ రచన చేస్తున్నారట. ఈ మేరకు త్వరలోనే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీలతో తెలంగాణ రాజకీయం గురించీ జనసేనాని చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ, ఏపీ నుంచి కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలోనే పోటీ చేసింది. పోటీ చేసిన అన్ని చోట్లా విజయం సాధించింది. మిగతా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం ఇప్పుడు జనసేన ముందుతున్న తక్షణ కర్తవ్యం. దాంతోపాటుగా, తెలంగాణలోనూ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం వుంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పట్లో ఎలాంటి ఉప ఎన్నికలూ వచ్చే అవకాశం కన్పించడంలేదు. కాకపోతే, స్థానిక ఎన్నికలు అయితే వచ్చే అవకాశం వుంది. మరోపక్క, తెలంగాణలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. భారత్ రాష్ట్ర సమితి రోజురోజుకీ మరింత బలహీన పడుతోంది. కాంగ్రెస్ అస్థిర రాజకీయాలు ఎన్డీయే కూటమికి రాజకీయంగా కలిసొచ్చే అవకాశం వుంది.
ఈ నేపథ్యంలో, బీజేపీ అధినాయకత్వంలో జనసేనాని ఇప్పటికే తెలంగాణ రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.