Pawan Kalyan: ఆలూ లేదు, చూలూ లేదు.. అప్పుడే సీఎం కుర్చీలో పవన్ కళ్యాణ్ అనడమేంటి.? చాలామంది ఈ కోణంలో పెదవి విరవొచ్చుగాక.! కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఓ వైపు, అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇంకో వైపు.. వెరసి, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
జనసేన పార్టీ ఓటు బ్యాంకు 15 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ, టీడీపీ సొంత సర్వేల్లోనే జనసేన పార్టీకి అటూ ఇటూగా 18 శాతం ఓట్లను కట్టబెడుతున్నారు. కొన్ని సర్వేలు జనసేనకి సింగిల్‌గా పోటీ చేసినా 8 నుంచి 12 అసెంబ్లీ సీట్లు వస్తాయని చెబుతున్న సంగతి తెలిసిందే.
ఆ ;ఛాన్సే లేదు.. జనసేనకు (Jana Sena Party) సింగిల్ డిజిట్ మాత్రమే.. అని వైసీపీ, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా గుస్సా అవుతున్నాయి. కానీ, కింది స్థాయిలో ఈక్వేషన్స్ ఎవరూ ఊహించని విధంగా మారుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అనూహ్యంగా బలపడుతోంది.
ఖచ్చితంగా జనసేన పార్టీ, రెండు ప్రధాన పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపించగలుగుతుంది. వైసీపీ, టీడీపీ చేస్తున్న తప్పిదాలు ముమ్మాటికీ జనసేనకు కలిసొస్తాయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనతో కలిసి వెళతామనే అంటోంది టీడీపీ. బీజేపీకి వేరే ఆప్షన్ కూడా లేదు.
ఈ నేపథ్యలో జనసేన 50 ప్లస్ నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతుందనీ, 30 నుంచి 40 సీట్లలో గెలవడం ఖాయమనీ కొన్ని సర్వేలు చెబుతున్నారు. అదే గనుక జరిగితే, సీఎం పీఠం విషయంలో జనసేనకు అడ్వాంటేజ్ పెరుగుతుంది. ఈ అంశాలపై ఇటు వైసీపీ, అటు టీడీపీ తీవ్రంగా మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం.