జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత నాగబాబు, ఈ సభా వేదికపైనుంచి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారబోతున్నాయి. ‘కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే, నాలుగేళ్ళు గడిచిపోతాయ్.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది వైసీపీనే..’ అని జగన్ తరచూ వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన నాగబాబు, జగన్‌ని హాస్యగాడిగా అభివర్ణించారు. అంతే కాదు, ‘మీరు నిద్రపోండి. మీరు నిద్రపోవడమే మాక్కావాలి. మేం, మరో ఇరవై ఏళ్ళపాటు మిమ్మల్ని డిస్టర్బ్ చేయం. ఇరవయ్యేళ్ళ తర్వాత మేలుకోండి..’ అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు.
ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, ఇలాంటి వేదికలపై చాలా బాధ్యతగా మాట్లాడాల్సి వుందంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చూశాం. కొందరు, నోటకొచ్చినట్లు మాట్లాడితే, ప్రజలు వాళ్ళకి ఎలాంటి తీర్పునిచ్చారో తెలుసు కాబట్టి, మనం బాధ్యతగా వుందాం.. అని నాగబాబు చెప్పారు.
‘పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఆనందంగా వుంది. స్వాతంత్ర్యానికి ముందు మహనీయులు జన్మించారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు మన ముందున్నారు.. ఇది మన అదృష్టం’ అని నాగబాబు చెప్పారు.
‘ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆవగింజంత కూడా కాదు. ముందు ముందు మరిన్ని అద్భుతాల్ని పవన్ కళ్యాణ్ నుంచి చూడబోతున్నారు. స్వర్ణయుగాన్ని చూడబోతున్నాం..’ అని నాగబాబు అన్నారు.