మహా సేన రాజేష్‌కి టీడీపీ నుంచి టిక్కెట్ దక్కినప్పుడు.. కళ్యాణ్ దిలీప్ సుంకరకి ఎందుకు టిక్కెట్ జనసేన నుంచి దక్కలేదు.? ఈ ప్రశ్న సోషల్ మీడియా వేదికగా జనసైనికుల నుంచి వస్తోంది. కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మడివరం, తణుకు.. ఈ నియోజకవర్గాల విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పొత్తు ధర్మంలో భాగంగా మిత్రపక్షమైన టీడీపీ మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయారు.?
రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే వుంటాయి.! కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న వైనం..! ఇలాంటివి గతంలో వైసీపీ నుంచి జనసేన మీదకు దూసుకొచ్చిన విమర్శలు. ఇప్పుడు అవే, జనసేన మీద జనసేన మద్దతుదారులే విమర్శనాస్త్రాలుగా సంధిస్తున్న వైనం చూస్తున్నాం.
ఎందుకిలా.? హీనపక్షం 30 వేల ఓట్ల స్ట్రాంగ్ బ్యాక్‌గ్రౌండ్ వున్న పై నాలుగు నియోజకవర్గాల్లో (గతంలో వచ్చిన ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో సత్తా.. ఇవన్నీ కలుపుకుంటే.. దానికంటే ఎన్నో రెట్లు పెరిగింది జనసేన బలం) జనసేన పోటీ చేసే అవకాశం లేకుండా పోవడం ఆశ్చర్యకరం.
అసలంటూ జనసేన మీదకు తొలుత వలపు బాణం విసిరింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో జనసేన పార్టీ, శాసించే పరిస్తితిలో వుండాలి. కానీ, యాచించే పరిస్థితి ఎందుకొచ్చింది.? 24 సరిపోవు, ఇంకో ఇరవై నాలుగు కనీసం ఖచ్చతంగా వుండాలి.. అని జనసైనికులు కొందరు తమ అధినాయకత్వాన్ని అడుక్కోవాల్సి వస్తోంది.
‘మీరు సీట్లు డిమాండ్ చేసి, సాధించండి. మేం గెలిపించుకుంటాం..’ అని జనసైనికులు జనసేన అధినేత మీద ‘ప్రేమతో’ ఒత్తిడి చేస్తున్నారు. ‘ఇదే ఫైనల్ కాదు.. మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం వుంది..’ అని బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి కొందరు జనసేన నేతలు చెబుతున్నా, కేటాయించిన 24 సీట్లలోనూ కోత పడుతుందన్న సంకేతాల్ని టీడీపీ పంపుతోంది.
నిడదవోలు నియోజకవర్గానికి కందుల దుర్గేష్ పేరుని జనసేన అధినేత ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అక్కడ తమకే అవకాశం కల్పించాలంటూ స్థానిక టీడీపీ క్యాడర్ గలాటా చేస్తోంది. అనకాపల్లి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ స్థానిక క్యాడర్ తిరుగుబాటు చేస్తే, జనసేన మరింత నష్టపోవచ్చు.
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు ఇలాగే వుంటాయ్.! మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహమేంటి.? అది అర్థం కాక జనసేన శ్రేణులు డీలాపడిపోతున్నాయి.