!రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాల్ని చేపట్టడం దేశ రాజకీయాల్లో కొత్తేమీ కాదు. కాకపోతే, జన సేన పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘క్రియాశీల కార్యకర్త’ అనే కొత్త పేరుతో, సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాజకీయాల్లోనే ఇదొక సంచలనం. క్రియాశీల కార్యకర్తగా పేరు నమోదు చేసుకున్న ప్రతి జన సేన కార్యకర్తకీ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. కార్యకర్తల నుంచే నాయకుల్ని ఎంపిక చేసేలా జన సేన పార్టీ రాజకీయ వ్యూహాన్ని రచించారు జన సేనాని పవన్ కళ్యాణ్.
అయితే, ఇప్పుడా క్రియాశీల కార్యకర్త పేరుని ‘ఉద్యమి’గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్చారు. సభ్యత్వ నమోదు కింద చెల్లించాల్సిన రుసుముని కూడా 500 నుంచి 400 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి సభ్యత్వం తీసుకున్న జన సేనాని 2 కోట్ల రూపాయల్ని పార్టీకి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. కాగా, ఉద్యమిగా పేరు నమోదు చేసుకునేందుకు పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్‌గా తొలుత ఎంచుకుంది జన సేన పార్టీ అధినాయకత్వం. ఉప ముఖ్యమంత్రి, జన సేనాని పవన్ కళ్యాణ్ శాసన సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం.
రేపటి నుంచి, అంటే ఫిబ్రవరి 26 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ‘ఉద్యమి’ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. గతంతో పోల్చితే, రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగేలా జన సేన పార్టీ అధినాయకత్వం తనదైన వ్యూహాల్ని రచించింది. జన సేన నాయకులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
జన సేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. అలానే ఇతర ముఖ్య నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పెద్దయెత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉద్యమిగా పేరు నమోదు చేయించుకున్న కార్యకర్తలు, నాయకులుగా ఎదిగేందుకు వీలవుతుందని జన సేనాని చెబుతున్న దరిమిలా, ఈసారి సభ్యత్వలు అంచనాలకు మించి వుండబోతున్నాయన్నది నిర్వివాదాంశం.
రుసుముని 400 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ, ఆ రుసుము చెల్లించలేనివారికి, స్థానిక నాయకత్వమే చెల్లించి, ఉద్యమిగా పేరు నమోదు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జన సేన మరింత బలోపేతం అయ్యేందుకు ఈ ‘ఉద్యమి’ ఎంతగానో దోహదం చేయనుందని జన సేన పార్టీ భావిస్తోంది.
