జనసేన పార్టీ బలోపేతం, విస్తరణలో సాధక్‌లు అత్యంత కీలక పాత్ర పోషించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సాధక్‌లు రాత్రింబవళ్లు శ్రమించి పార్టీని ప్రజల్లో బలంగా నిలబెట్టారని ఆయన కొనియాడారు. రాజమండ్రిలో నిర్వహించిన సాధక్‌ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు.
గత 12 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసైనికులు, వీరమహిళల సంక్షేమం కోసం ఆయన ఎప్పుడూ అండగా నిలుస్తారని తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం వెనుక సాధక్‌లు, కార్యకర్తల కష్టమే ప్రధాన కారణమని చెప్పారు.
జనసేన కార్యకర్తలు ఇతర పార్టీలతో పోలిస్తే ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారని, ప్రజా సేవనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతారని పేర్కొన్నారు. అందుకే పార్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి పరామర్శించే స్థాయికి జనసేన నాయకత్వం ఎదగడం పార్టీకి దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ స్థాయి గుర్తింపు వెనుక పవన్ కళ్యాణ్ పట్టుదల, నిరంతర కృషి ఉందన్నారు.
పార్టీ సభ్యత్వాన్ని కేవలం ఇన్సూరెన్స్‌తో ముడిపెట్టవద్దని, అది జనసేన సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రూ.400 సభ్యత్వాల కోసం సాధక్‌లు క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి కృషి అమోఘమని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మినవారే రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేయగలరని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 వేల మంది సాధక్‌లతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి నుంచే ప్రారంభించామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధక్‌లు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గతంలో అధికారంలోకి వస్తామని కూడా ఊహించని పరిస్థితి నుంచి నేడు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చే స్థాయికి జనసేన ఎదిగిందని పేర్కొన్నారు. ఇదే ఐక్యత, పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
