పెద్ద నోట్ల రద్దుతో (డిమోనిటైజేషన్) దేశంలో సరికొత్త మార్పు వస్తుందని అంతా ఊహించారు. తాను చెప్పిన మార్పు వచ్చి తీరుతుందంటూ ఆ నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని ఎవరూ మర్చిపోలేరు. తీవ్రవాదం అంతమైపోతుందన్నారు, దేశంలో అవినీతికి ఆస్కారమే వుండదన్నారు. నకిలీ కరెన్సీకి అవకాశం వుండదనీ, నల్లధనం జాడే కన్పించదనీ ప్రధాని నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ గురించి ప్రకటిస్తూ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ, ఏం జరిగింది? ఇప్పటికీ దేశంలో పైన చెప్పిన ‘చెడు’ అంశాలన్నీ సజీవంగానే వున్నాయి.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నికలు జరిగినన్నాళ్ళూ చాలా చోట్ల 2 వేల రూపాయల నోటు సామాన్యుడికి అందలేదు అధికారికంగా. అనధికారికంగా మాత్రం.. అంటే, ఓట్లను కొనేందుకు ఆ నోటు బాగా ఉపయోగపడింది. ఆ సంగతి పక్కన పెడితే, ఇప్పుడు జమిలి ఎన్నికల గురించిన చర్చ జరుగుతోంది. దేశాన్ని అభివృద్థి పథం వైపు నడిపించేందుకు ఇదో ప్రయోగమని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. ఈ మేరకు కేంద్రం, పార్లమెంటులో ప్రాతినిథ్యం వున్న పార్టీలతో సమావేశం నిర్వహించింది. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడమే ఈ జమిలి కథ. కానీ, మన దేశంలో అది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమవుతుంది.. కానీ, అది ఒక్కసారికి మాత్రమే. ఆ తర్వాత చాలా తేలిగ్గా ఆ జమిలి కాస్తా కంగాలీగా మారిపోతుంది.
లోక్‌సభ ఓ టెర్మ్ పదవీ కాలం ఐదేళ్ళు. అసెంబ్లీ కూడా అంతే. కానీ, అర్థాంతరంగా ప్రభుత్వం కుప్ప కూలిపోతే? ఆకస్మిక ఎన్నికలు తప్పవు. ఓ రాష్ట్రంలో ప్రభుత్వం కుప్ప కూలిపోతే, దేశమంతా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా.? దేశంలో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరగాల్సి వుంటుందా.? అనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. అతి ముఖ్యమైన ఈ విషయాల మీదనే ఎలాంటి ‘గ్రౌండ్ వర్క్’ చేయకుండా, జమిలి ఎన్నికల గురించిన చర్చ.. అంటే అందులో అర్థమేముంటుంది.? జమిలి ఎన్నికలు మంచిదే.. కానీ, అందులో చాలా ఇబ్బందులున్నాయి. ఇబ్బందులంటే అలాంటిలాంటివి కావు. డిమానిటైజేషన్‌లా నరేంద్ర మోడీ సర్కార్ జమిలి ఎన్నికల విషయంలోనూ మొండి వైఖరి ప్రదర్శిస్తే.. అంతే సంగతులు.