పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. బర్త్ డే ముందు రోజు మొదలుకుని బర్త్ డే వరకు ప్రత్యేక షో లను వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 700 స్క్రీన్స్ కు పైగానే ఈ సినిమాను స్క్రీనింగ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ స్థాయిలో జల్సా సినిమాను రీ రిలీజ్ చేయడంతో వసూళ్లు అదే రేంజ్ లో ఉన్నాయి. కేవలం నైజాం ఏరియాలో జల్సా సినిమా రీ రిలీజ్ తో 1.2 కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యాయట.
ఇక ఏపీలో కూడా కోటికి పైగానే వసూళ్లు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో జల్సా సినిమా రీ రిలీజ్ తో 2.35 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఇతర ముఖ్య నగరాల్లో మరియు అమెరికాలో కూడా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. అక్కడ కూడా భారీగానే వసూళ్లు నమోదు అయ్యాయి.
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా ఏకంగా 2.85 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి రీ రిలీజ్ లో సరికొత్త రికార్డ్ ను సెట్ చేసింది. పోకిరి సినిమా తో మొన్న మహేష్ బాబు కోటి వరకు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ మొత్తంకు మూడు రెట్లు అధికంగా జల్సా రీ రిలీజ్ లో వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.