మట్టి మాఫియా, ఇసుక మాఫియా.. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్.! మనుషుల అక్రమ రవాణా, రాజకీయ హత్యలు.! వాట్ నాట్.! చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పలుగా బాగోతాలు. ప్రమోషన్లు ఇస్తామని లక్షలు ‘దొబ్బేశారు’ అంటూ మీడియాకెక్కుతున్నారు బాధితులు. హత్యలు, అత్యాచారాలు చేశారంటూ బాధిత కుటుంబాలు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నాయి.
రాష్ట్రంలో ఇంతలా అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలూ చోటు చేసుకున్నాయా.? అని నివ్వెరపోవాల్సిన పనిలేదు. మీడియా నెత్తీ నోరూ బాదుకుంటూనే వుంది. బాధితులు కన్నీరు మున్నీరవుతూనే వున్నారు. కానీ, పోలీస్ వ్యవస్థ బాధితులపైనే జులుం ప్రదర్శిస్తూ వచ్చింది.
ఇప్పుడిక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది.? చీఫ్ సెక్రెటరీ, డీజీపీ.. ఇలా కీలక పోస్టుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న దరిమిలా, బాధితులకు న్యాయం జరుగుతుందా.? జరిగి తీరాల్సిందే.
గతంలో మంత్రులుగా పనిచేసినవారిపై కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ కనుసన్నల్లో అరాచకాలకు పాల్పడిన అధికారులపైనా కేసులు నమోదవుతున్నాయ్. కొత్త ప్రభుత్వం నిజానికి, ఇంకా ఏర్పడనే లేదు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అసలు కథ మొదలవుతుంది. ‘తప్పు చేసినవారికి శిక్షలు తప్పవు..’ అంటున్నారు కూటమి నేతలు. ‘కక్ష సాధింపు చర్యలు మాత్రం వుండవు. తప్పు చేసినవారు మాత్రం తప్పించుకోలేరు..’ అని కూడా చెబుతున్నారు కూటమి నేతలు.
అరెస్టుల పర్వం అంటూ మొదలైతే, రాష్ట్రంలోని జైళ్ళు సరిపోతాయా.? అన్నది ఆలోచించాల్సిన విషయం. ఇది, జనం నుంచి వస్తున్న మాట. రాష్ట్ర ప్రజానీకం, తమ తమ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో.. గడచిన ఐదేళ్ళలో జరిగిన దారుణాలు, వైసీపీ అరాచకాలపై చర్చించుకుంటున్న విషయాలే ఇవి.