చెల్లెలు కట్టుకున్న చీర రంగు మీద కూడా నీఛాతి నీచమైన కామెంట్లు చేసే అన్నయ్య ఎవరైనా, ఎక్కడైనా వుంటారా.? ఎందుకు వుండరు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో వున్నారు కదా.!
రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో వుండటం కొత్తేమీ కాదు. రక్త సంబంధాల కంటే, రాజకీయ సంబంధాలు ముఖ్యమనుకునేవారిని కూడా తప్పు పట్టలేం. రాజకీయం అలాంటిది.
కానీ, ఓ మహిళ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసేముందు, ఆమె తన రక్త సంబంధీకురాలు, తోడబుట్టిన చెల్లెలు.. అని కూడా ఆలోచించకపోతే ఎలా.? ఇదే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆగ్రహావేశాలతో ఊగిపోవడానికి కారణమయ్యింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, రాజకీయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పతనాన్ని కోరుకుంటున్నారు వైఎస్ షర్మిల. నిజానికి, అందులో కొంత భాగాన్ని ఆమె చూసేశారు కూడా. పూర్తిస్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పతనాన్ని ఆమె ఇంకా ఇంకా బలంగా కోరుకుంటున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఇద్దరి మధ్యా ఆస్తుల పంపకాల గొడవలున్నాయి. ఆపై రాజకీయ పరమైన విభేదాలూ వున్నాయి. అవి తారా స్థాయికి చేరుకుంటున్నాయి.
వైసీపీకి రాజీనామా చేశాక విజయ సాయి రెడ్డి, వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారట. వైసీపీకి రాజీనామా చేసినా, జగన్ మనిషిగానే విజయ సాయి రెడ్డి, వైఎస్ షర్మిల దగ్గరకు వెళ్ళి ‘రాజీ వ్యవహారాలు’ నడిపారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
కానీ, షర్మిల మాత్రం, తన వద్దకు విజయ సాయి రెడ్డి వచ్చి చెప్పిన మాటల్ని మీడియా ముందు తాజాగా పేర్కొనడాన్ని బట్టి చూస్తోంటే, విషయం వేరే ఏదో వుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
ఆస్తుల పంపకాల వ్యవహారాలకు సంబంధించి తన తల్లి మీద కూడా జగన్ ఆరోపణలు చేయడం, వైసీపీ నాయకులతో తమని తిట్టించడం.. అత్యంత బాధాకరమైన విషయాలనీ, విజయ సాయి రెడ్డితో కూడా తమపై ఆరోపణలు చేయించారనీ, ఈ విషయమై విజయ సాయి రెడ్డి తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారని షర్మిల చెబుతున్నారు.
విధిలేని పరిస్థితుల్లోనే జగన్ చెప్పినట్లు విజయ సాయి రెడ్డి వినాల్సి వచ్చిందన్న వైఎస్ షర్మిల, ఇంకా హద్దులు దాటి విమర్శలు చేయలేక, విజయ సాయి రెడ్డి వైసీపీని వీడారన్న అర్థం వచ్చేలా మాట్లాడారు.
ప్రస్తుతానికైతే విజయ సాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే. ఆయన వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, రాజకీయం అంత తేలిగ్గా వదిలే ‘రోగం’ కాదంటారు.. రాజకీయాల్లో తలపండినవాళ్ళు.
విజయ సాయి రెడ్డి ముందు ముందు వైఎస్ షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులేస్తారా.? అదే జరిగితే, ఆయన్ని అక్రమాస్తుల కేసులో ‘అప్రూవర్’గా చూడబోతున్నామా.? విలువలు విశ్వసనీయత.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని విజయ సాయి రెడ్డి సీరియస్‌గా తీసుకునే అవకాశమెంత.?
రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఒక్కటి మాత్రం నిజం.. జగన్ పతనానికి సంబంధించి ఏ ఒక్క అవకాశాన్నీ షర్మిల వదులుకునేలా కనిపించడంలేదు. జగన్ పతనమే తన పంతం.. అని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లున్నారు.