పుష్ప-2 మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. మూడేండ్ల తర్వాత ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. కాగా నిన్న రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా వేశారు. దాంతో సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కామన్ కదా అనుకునేరు. కానీ అనంతపురం జిల్లా గుత్తిలో వేసిన ఫ్లెక్సీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలో పుష్పరాజ్ ఫొటోతో పాటు జగన్ ఫొటో కూడా ఉంది. మాకోసం నువ్వు వచ్చావ్ నీ కోసమ మేం వస్తాం తగ్గేదే లే.. అనే క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇంకేముంది ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఇక్కడే కాదు ఏపీలో చాలా చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల వైసీపీ కార్యకర్తలు పుష్ప-2కు మద్దతుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. దాంతో పుష్ప-2 రాజకీయ అంశంగా మారుతోంది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా రాజకీయ పరమైన అంశాల గురించి మాట్లాడలేదు. జగన్ కు మద్దతుగా ఎన్నడూ స్పందించలేదు. అలా అని కూటమికి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. కేవలం తన సినిమా గురించే మాట్లాడుతున్నాడు.
కానీ ఇలాంటి ఫ్లెక్సీలతో బన్నీ కూడా వివాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కొంత అసంతృప్తిలో ఉంటే.. ఇలాంటి ఫ్లెక్సీలు ఆ వార్ ను మరింత పీక్స్ కు చేరుకునేలా చేస్తాయని అంటున్నారు. కాబట్టి అల్లు అర్జున్ ను రాజకీయాలకు కేంద్రంగా మార్చొద్దని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.