ఏంట్సార్ అది.! ఔను, వైఎస్ జగన్ ఏదన్నా మాట్లాడితే, వైసీపీ శ్రేణులే విస్తుపోతుంటాయిలా.! కళ్ళు మూసి తెరిచేలోపు ఏడాది అయిపోయింది.. మూడు నాలుగేళ్ళ తర్వాత వైసీపీ పార్టీదే.. అంటూ తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు.
వైసీపీ, పదేళ్ళపాటు ప్రతిపక్షంలో వుందట.! అలాగని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. వైసీపీ, పదిహేనేళ్ళ ప్రస్తావన గురించి, పదిహేనో ఆవిర్భావ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోపక్క ఒక్కడితో మొదలైంది.. అంటూ చెప్పుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా. ఒక్కడితో మొదలవడమేంటి.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, వైఎస్ విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్, విజయమ్మ.. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. విజయమ్మ అప్పట్లో వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు.
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జైలుకు వెళితే.. వైసీపీ జెండా పట్టుకుని, జనంలోకి వెళ్ళి.. సుదీర్ఘ పాదయాత్ర చేశారు వైఎస్ షర్మిల.
అసెంబ్లీలో వైసీపీ శాసనసభా పక్ష నేతగా వైఎస్ విజయమ్మ కదా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మాట్లాడింది.? అప్పట్లో జగన్, ఎంపీగానే కదా వుండేవారు.!
ఆ విజయమ్మ కావొచ్చు, ఆ షర్మిల కావొచ్చు.. ఇప్పుడు జగన్ వెంట లేరు. వైసీపీ, ప్రతిపక్ష హోదాలో పొందింది 2014లో మాత్రమే. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా లేనే లేదు. పదకొండు సీట్లకు పరిమితమై, ప్రతిపక్ష హోదాకి కూడా దూరమైంది వైసీపీ.
అధికారంలో వున్నప్పుడేమో కళ్ళు నెత్తికెక్కి రాజకీయాలు చేసింది వైసీపీ. పరిపాలన గాలికొదిలేసి, కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుతం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ బహిరంగ సభని కూడా నిర్వహించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
బెంగళూరుకి పరిమితమైపోయి, అడపా దడపా మాత్రమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కనిపిస్తున్నారు. అందుకే, ఆయన ‘కళ్ళు మూసుకుంటే’ అంటూ పదే పదే చెబుతున్నారు. కానీ, వైసీపీ నేతలు కార్యకర్తల పరిస్థితి అది కాదు కదా.!
కళ్ళు మూస్తే కేసులు, కళ్ళు తెరిస్తే అరెస్టులు.. అన్నట్లుంది వ్యవహారం. వైసీపీ హయాంలో జగన్‌లానే కళ్ళు నెత్తికెక్కి రెచ్చిపోయినందుకు, వివిధ కేసుల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, తాడేపల్లి కొంపలో పబ్జీ ఆటకే పరిమితమయ్యారన్న విమర్శలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వుండేవి. అందుకేనేమో, ఆయన తరచూ ‘కళ్ళు మూసుకోవడం’ గురించి గొప్ప గొప్పగా సెలవిచ్చేస్తుంటారు.
రాజకీయం అంటే ప్రజా సేవ. అధికారంలో వున్నా, లేకపోయినా.. ప్రజా సేవ గురించే ఆలోచించాలి. అలా ఆలోచిస్తే, కంటికి నిద్ర ఎలా వస్తుంది.?
ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే, యువత పోరు.. అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి వైసీపీ పిలుపునివ్వడం. ఇటు ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోలేక, అటు నిరసన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనలేక.. నీరసించిపోయింది వైసీపీ క్యాడర్.