‘..క్కలో వేసెయ్యాలి’.. అంటూ, ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోరు జారారు.! అంతే కాదు, చీటింగ్ కేసు కూడా పెట్టాలట చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీద. ఎందుకంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదట కూటమి ప్రభుత్వం.
రాజకీయాలన్నాక విమర్శలు సహజమే. ప్రతిపక్ష నేత హోదా ఆశిస్తున్న వైఎస్ జగన్, తన రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయడంలో వింతేముంది.? కాకపోతే, విమర్శల స్థాయి హద్దులు దాటితేనే, అసలు సమస్య. ‘..క్కలో వేయాలి’ అని ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గురించీ, మంత్రి గురించీ, ఉప ముఖ్య మంత్రి గురించీ నోటికొచ్చినట్లు మాట్లాడటం క్షమార్హం కాదు.
‘గాడిదలు కాస్తున్నారా.?’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా వైఎస్ జగన్ మాట తూలారు. ఇవన్నీ వైరల్ కంటెంట్.. అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్టు రాసిచ్చేటప్పుడు, సజ్జల రామకృష్ణా రెడ్డి, అండర్ లైన్ చేసి వుంటారేమో.! అందుకే, వీటిని స్పెషల్‌గా మెన్షన్ చేశారు వైఎస్ జగన్.
2019 నుంచి 2024 మధ్య ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ జగన్, అధికారిక బహిరంగ సభల్లోనూ అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. ఆ ఫలితమే, వైసీపీ 11 సీట్లకు పరిమితమైపోయేలా చేసింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయాక కూడా, అదే తీరులో మాట జారితే, ప్రజలు క్షమించే పరిస్థితి వుంటుందా.? ఛాన్సే లేదు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠమెక్కాలనుకుంటున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన అలా కోరుకుంటోంటే, బెంగళూరు వదిలేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే వుండాలి. అన్నిటికీ మించి, నోటి శుద్ధి అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా చాలా ముఖ్యం.
ముందే చెప్పుకున్నట్లు రాజకీయాలన్నాక విమర్శలు తప్పవు. కానీ, విమర్శలు చేసేటప్పుడు స్థాయిని దిగజార్చేసుకోకూడదు ఏ రాజకీయ నాయకుడైనా సరే.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే జైల్లో పెట్టాల్సి వస్తే, మద్య నిషేధం అమలు చేయనందుకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా జైల్లో వెయ్యాల్సి వస్తుంది కదా.?
‘..క్కలో’ అని వైఎస్ జగన్ భాషలో చెప్పడానికి బహుశా కూటమి నేతలు కొంచెం ఆలోచిస్తున్నారేమోగానీ, లేదంటే.. అంతకన్నా గట్టిగా సమాధానం టీడీపీ నుంచి అలానే జన సేన నుంచీ వైసీపీ అధినేత మీదకు వచ్చి వుండేదే.! వస్తుందేమో కూడా.!
వారానికోసారి బెంగళూరు నుంచి రావడం, అదోరకమైన ప్రెస్ మీట్ లాంటిది పెట్టడం, ఆ వెంటనే తిరుగు ప్రయాణంలో బెంగళూరుకి వెళ్ళిపోవడం.. ఇదంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి వారం ఓ ప్రసహనంలా మారిపోయింది.
