ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు. ప్రజా క్షేత్రంలో ప్రజా వ్యతిరేకులుగా మిగిిలపోతారు.
అదేంటో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి కూడా, రాష్ట్ర రాజధాని అమరావతికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకంగా నినదిస్తూ వుంటారు. అధికారంలో వున్నప్పుడూ అదే తంతు, అధికారం కోల్పోయాక కూడా అదే తంతు. వైసీపీ, 151 నుంచి 11 సీట్లకు పడిపోవడానికి వున్న చాలా కారణాల్లో, అమరావతిపై వైసీపీ వ్యవహరించిన వైఖరి కూడా ఒక ముఖ్యమైన కారణం.
అయ్యిందేదో అయిపోయింది, ఇకపై రాజధాని విషయంలో వైసీపీ నిర్ణయం మారుతుంది. అమరావతికే వైసీపీ కట్టుబడి వుంటుంది.. అని బొత్స సత్యనారాయణ లాంటి వైసీపీ కీలక నేతలు, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వ్యాఖ్యానించారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం తన వైఖరి మార్చుకోలేదు.
రాజధాని అమరావతి రివర్ బేసిన్‌లో వుందనీ, రివర్ బేసిన్‌లో సాధారణ ఇళ్ళు కట్టుకోవడానికి కూడా అనుమతి వుండదని సుప్రీంకోర్టు చెబుతుందని తాజాగా వైఎస్ జగన్, సత్యదూరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతటి ద్వేషం వుందన్నది ఈ వ్యాఖ్యలతో నిరూపితమైపోయింది.
దేశంలో చాలా ప్రముఖ నగరాలు నదీ తీరానే వర్ధిల్లుతున్నాయి. అమరావతి కూడా, కృష్ణా నది పక్కనే నిర్మితమవుతోంది. ఇందులో వింతేముంది.? ప్రపంచంలో చాలా దేశాలు కూడా, నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి. గొప్ప నగరాలుగా మారాయి.
ఏదిఏమైనా, కూటమి ప్రభుత్వానికి అమరావతి విషయంలో ఆయుధాన్ని అందించారు వైఎస్ జగన్. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ, సమీప భవిష్యత్తులో పుంజుకునే ప్రసక్తే లేకుండా పోయిందిప్పుడు.
‘అబ్బే, జగన్ ఉద్దేశ్యం అది కాదు’ అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి కవరింగ్ డైలాగులు పేల్చుతూ వీడియో విడుదల చేసినా, అప్పటికే డ్యామేజ్ అంచనాలకు మించి జరిగిపోయింది.
