‘జగనన్న ప్రచారం ఖర్చు’ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నా కొత్త సంక్షేమ పథకాన్ని తెరపైకి తెచ్చారా.? సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు వ్యక్తం చేస్తున్న అనుమానమిది.
‘మా ప్రభుత్వ హయాంలో పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు వుండవు.. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది..’ అంటూ ప్రతిపక్షంలో వున్నప్పుడు వైసీపీ నినదించింది. కానీ, అధికారంలోకి వచ్చాక, ప్రచారం విషయంలో అంతకు మించి.. అనే స్థాయిలో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది.
మరీ ముఖ్యంగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, సొంత మీడియాని ‘అడ్డంగా మేపుతోంది’ అనే విమర్శలు చాలా గట్టిగా వినిపిస్తుండడం గమనార్హం. చంద్రబాబు హయాంలో టీడీపీ అనుకూల మీడియా బాగుపడినప్పుడు, వైఎస్ జగన్ హయాంలో బులుగు మీడియా బాగు పడాలి కదా.? అంటే, అప్పుడైనా.. ఇప్పుడైనా.. ప్రభుత్వాల పైత్యం, ప్రజలకు శాపమే.. అని అర్థం చేసుకోవాలన్నమాట.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి సహా, మంత్రులు, ఇతర కీలక వ్యక్తులు (ప్రభుత్వంలో వున్నవారు) పర్యటనలకు వెళ్ళే క్రమంలో కాన్వాయ్ వాహనాల ఖర్చుకి సంబంధించి గడచిన మూడేళ్ళలో ఏకంగా 18 కోట్ల వరకూ బకాయిలు వున్నాయని రవాణా శాఖ వర్గాలు ప్రభుత్వానికి విన్నవించుకున్నాయట.
ఇదే నిజమైతే, చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయంగానే దీన్ని చూడాలి. జనంలోకి ముఖ్యమంత్రి సహా మంత్రులు వెళ్ళడం అనేది సర్వసాధారణమైన విషయమే కావొచ్చు. కానీ, దాని కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడమా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న.
సంక్షేమ పథకాల పేరుతో జనానికి వేల కోట్లు ఇచ్చేశామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. గడచిన మూడేళ్ళలో పబ్లిసిటీ కోసం చేసిన ఖర్చు గురించి కూడా బయట పెడితే బావుంటుందేమో.!