వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవడం సహజమే. అయితే, అది వైఎస్సార్సీపీలోనే చిచ్చుపెట్టే వ్యవహారమైతే ఎలా.? కానీ, అయ్యింది.. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన, వైఎస్సార్సీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇద్దరు మంత్రుల మధ్య పరోక్షంగా మాటల దాడికి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ కారణమవుతోంది. ఒకరేమో సీనియర్ మంత్రి, ఇంకొకరేమో మైనార్టీ వర్గానికి చెందిన మంత్రి. ఒకాయన నోరు జారేశారు.. ఇంకొకాయన, రాజీనామాస్త్రాన్ని తెరపైకి తెచ్చారు.
మరోపక్క, పార్టీలో అంతర్గతంగా ఈ వ్యవహారాలపై తీవ్రాతి తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్రంతో చర్చించేందుకే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలంటూ ఓ పక్క వైసీపీ నేతలు చెబుతోంటే, ఇంకో పక్క అదే వైసీపీకి చెందిన ముఖ్య నేతలు.. జగన్ ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుండడం ఆశ్చర్యకరమే.
ప్రతిపక్షం టీడీపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులపై ఐటీ సోదాలు ఇటీవల జరిగితే, ఆ వ్యవహారంపై నానా రచ్చా జరిగింది. వైసీపీ, టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. అనూహ్యంగా ఆ యాగీ అటకెక్కి.. వైసీపీలో ప్రకంపనలు షురూ అవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
బీజేపీలో కొందరు నేతలు, వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతుండడం తెల్సిన విషయమే. అదే సమయంలో వైసీపీలోనూ చాలామంది బీజేపీ పట్ల సానుకూలంగా వున్నారు. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. వైసీపీ – బీజేపీ తెరచాటు బంధం.. ఇప్పుడు వైసీపీలో అంతర్యుద్ధానికి కారణమయ్యేలా వుంది.
బీజేపీలో ఈ పరిస్థితి వుండదు. ఎందుకంటే, బీజేపీ హైకమాండ్ కన్నెర్రజేస్తే.. ఎదురు తిరిగేంత సీన్.. ఆ పార్టీలో ఎవరికీ లేదు. వైసీపీలో పరిస్థితి అది కాదు. సీనియర్ నేతలకీ, జూనియర్లకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో చిన్న ఘటన అయినా.. పెను ప్రకంపనలకు కారణమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది వైసీపీలో. అయితే, జగన్ ఢిల్లీ నుంచి వచ్చి మొత్తం పరిస్థితిని చక్కదిద్దేస్తారని వైసీపీ ముఖ్య నేతలు సెలవిస్తున్నారు.