చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో, ఆయన్ని ఏకాకిగా మార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయాల్లో రాజకీయ యెత్తుగడల్ని తప్పు పట్టలేంగానీ.. వైఎస్ జగన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు మాత్రం.. ముమ్మాటికీ తప్పే.!
ఇప్పటికీ, ఆ వైసీపీ చెత్త వ్యూహాలు ఇంకా అలానే నిస్సిగ్గుగా అమలవుతున్నాయి. చంద్రబాబు విషయంలో అయినా, పవన్ కళ్యాణ్ విషయంలో అయినా.. వైసీపీ రాజకీయ వ్యూహాలు అప్పటికీ, ఇప్పటికీ అస్సలేం మారలేదు.
జూనియర్ ఎన్టీయార్ పేరుని తెరపైకి తెచ్చి, టీడీపీని ఇబ్బందులు పెట్టాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీయార్ ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదికగా జరిగిన, జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.
అలానే, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టేలా రకరకాల చెత్త వ్యూహాల్ని వైసీపీ తెరపైకి తెచ్చి, అబాసుపాలయ్యింది. రాజకీయ వ్యూహాల్లో భాగంగా, కుటుంబాల్లో చిచ్చు పెట్టాలన్న స్కెచ్ ఐ-ప్యాక్ నుంచేనా.? అన్నది పక్కన పెడితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కాస్తంత విజ్ఞతతో ఆలోచించి వుండాల్సింది. కానీ, స్వయంగా వైఎస్ జగన్, అలాంటి నీఛమైన రాజకీయాల్ని ప్రోత్సహించారు.
ఇప్పుడేమయ్యింది.? వైసీపీలో విజయమ్మ లేరు, షర్మిల కూడా లేరు. అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడైన విజయ సాయి రెడ్డి కూడా దూరమయ్యారు. ‘మీ బిడ్డ’ అని పదే పదే జనాన్ని ఉద్దేశించి జగన్, సింపతీ కార్డు వాడుతారుగానీ, ఎవరూ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని కనీసం, ‘నాయకుడు’ అని కూడా అనుకోని పరిస్థితి వచ్చింది.
మరోపక్క, ఏ కుటుంబాల్లో చిచ్చు పెట్టాలని వైఎస్ జగన్ అనుకున్నారో, ఆ కుటుంబాలు మరింత బలోపేతమయ్యాయి.. చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టి, మరింతగా తమ కుటుంబాల్ని బలోపేతం చేసుకుంటున్నారు ఆ కుటుంబాల్లోని వ్యక్తులు.
చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల ఆత్మీయంగా కలుసుకుని, దశాబ్దాలుగా తమ మధ్య వున్న మనస్పర్ధల్ని తొలగించుకున్న సంగతి తెలిసిందే. ఇదే దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వైసీపీ గతంలో, తమవైపుకు తిప్పుకుని, ఆయన్ని అస్త్రంగా మార్చి.. చంద్రబాబుపైకి ప్రయోగించిన సంగతి తెలిసిందే.