Fateh: బాలీవుడ్ నటులు సోనుసూద్, జాక్వెలిన్ ఫెర్నాండిస్ జంటగా ‘ఫతే’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానున్నట్లు సోనుసూద్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. సోను సొంత బ్యానర్ అయిన శక్తి సాగర్ ప్రొడక్షన్స్ లో ఇది రూపొందుతోంది. వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ చంద్రచూడ్, అన్షుమాన్ సింగ్, సోనాలి సూద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సోను సూద్ ఎన్నో తెలుగు చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం ‘అరుంధతి’ కి గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. కరోనా సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా సోను ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
మరోవైపు జాక్విలిన్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈమె నటించిన ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘ఆప్లాస్’ అనే పాట ప్రస్తుతం ఆస్కార్ రేసులో నిలిచింది. ఇదే విభాగంలో తెలుగు పాట ‘నాటు నాటు’ పాట పోటీ పడుతోంది.