ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటాయ్. థియేటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచీ లెక్కలు తెచ్చుకోవడం ఈ రోజుల్లో తేలికైన విషయమే. ఆ క్రమంలో ఫలానా సినిమా హిటు, ఫలానా సినిమా ఫ్లాపు.. అని ‘బాక్సాఫీస్ ట్రాకర్లు’ తేల్చేస్తున్నారు.
సరే, మారిన పరిస్థితుల్లో ఏది తప్పు.? ఏది ఒప్పు.? అని తేల్చడం కష్టమనుకోండి.. అది మళ్ళీ వేరే చర్చ. సంక్రాంతి సినిమాలు ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద ఎలా వసూళ్ళను రాబట్టాయి.? రాబడుతున్నాయి.? అన్నదానిపై, నిత్యం కలెక్షన్ల వివరాలు చూస్తున్నాం.
ఇంకోపక్క, సినీ పరిశ్రమపై ఐటీ దాడుల కలకలం అందర్నీ విస్మయానికి గురిచేసింది. మరీ ముఖ్యంగా దిల్ రాజు, మైత్రీ మూవీస్.. ఇలా ఇటీవల సినిమాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లపై ఐటీ దాడులు పెద్దయెత్తున జరిగాయి. ఈ ఐటీ దాడుల్లో ఏం తేలింది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
‘పుష్ప 2 ది రూల్’ సినిమా కూడా ఈ ఐటీ దాడుల వ్యవహారంలో వుందిట. 2 వేల కోట్లకు పైనే పుష్ప వసూలు చేసిందంటూ నిర్మాణ సంస్థ స్వయంగా అధికారిక పోస్టర్లను విడుదల చేస్తోంది. ‘గేమ్ ఛేంజర్’కి తొలి రోజు తప్ప, ఆ తర్వాత ఎలాంటి పోస్టర్ రాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకి వసూళ్ళ పంట.. అంటున్నారు నిర్మాత దిల్ రాజు. ‘డాకు మహరాజ్’ పరిస్థితీ దాదాపు ఇంతే.
మరి, ఐటీ శాఖ అధికారులు.. ఆ వసూళ్ళ లెక్కల గురించి నిర్మాతల దగ్గర ఆరా తీసే పరిస్థితి వుంటుందా.? ఒకవేళ ఆరా తీస్తే, ఆయా నిర్మాతలు ఏం లెక్కలు చూపిస్తారు.? పోస్టర్ల మీద కనిపించే నెంబర్లకీ, వాస్తవ వసూళ్ళకి అస్సలు పొంతనే వుండదు. అదే సినీ మాయ.!
మరి, సినీ మీడియాలో రాతలు, సోషల్ మీడియాలో అభిమానుల రచ్చ.. ఇవన్నీ దేనికి.? అంటే, అదంతా. సినిమా అంటేనే మ్యాజిక్. పైన పటారం, లోన లొటారం.. అంటారు కదా.. అలాంటిదే.!
కానీ, సినిమాల మీద దుష్ప్రచారం, దీనికోసం కొన్ని పీఆర్ టీమ్స్ పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం.. ఇదంతా ఓ మాఫియాలా తయారైంది. ఆ మాఫియానే ఫ్లాప్ సినిమాలకీ వేల కోట్ల వసూళ్ళంటూ ప్రచారం చేయడం చూస్తున్నాం. ఆ మాఫియా పుణ్యమా అని.. ఇదిగో, ఈ ఐటీ దాడులొకటి.!
గతంలో కూడా ఓ పెద్ద సినిమా విషయమై జరిగిన వసూళ్ళ ప్రచారానికీ, వచ్చిన వసూళ్ళకీ అస్సలు పొంతన లేకుండా పోయింది. ఆ విషయం ఐటీ దాడుల తర్వాతే వెల్లడయ్యింది. మరిప్పుడు, ‘పుష్ప 2 ది రూల్’ సహా, సంక్రాంతి సినిమాల విషయమై జరుగుతున్న ప్రచారం.. వాస్తవాలు.. వీటి వెనుక లోతు ఐటీ దాడుల తర్వాత తెలుస్తుందా.? వేచి చూడాల్సిందే.