తండ్రీ – కొడుకు మధ్య కొట్లాట జరిగిందట. గాయాలతో పోలీసుల్ని ఆశ్రయించాడట కొడుకు. తండ్రి కొట్టాడన్నది కొడుకు ఆరోపణ అట. కాదు కాదు, కొడుకే తండ్రిని కొట్టాడంటూ ఇంకో ఫిర్యాదు వెళ్ళిందట.
మంచు మోహన్‌బాబు ఇంటి వ్యవహారమిది. పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలూ ఫిర్యాదు చేసుకున్నాయనీ, విద్యాసంస్థలు అలాగే, ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించి పంపకాల విషయంలో వివాదం ముదిరి పాకాన పడి, కొట్టుకునేదాకా వెళ్ళిందంటూ గుసగుసలు షురూ అయ్యాయి.
ఇంతలోనే, ఖండన ప్రకటన ఒకటి ‘పీఆర్’ టీమ్ నుంచి వచ్చింది. ఎవరూ ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదన్నది ఆ ప్రకటన సారాంశం. ఇంతకీ, అసలేం జరిగింది.? నిప్పు లేకుండా పొగ వస్తుందా.? పోలీస్ స్టేషన్‌లో నిజంగా ఫిర్యాదు అంటూ జరిగితే, ఆ వివరాలు బయటకు పొక్కకుండా వుంటాయా.? వివరాలు బయటకు పొక్కాక కూడా, తూచ్ అనేస్తున్నారా.?
నిజానికి, గతంలోనూ ఓ సారి, ఈ తరహా ప్రచారమే జరిగింది. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందన్నది అప్పట్లో జరిగిన ప్రచారం తాలూకు సారాంశం. మంచు విష్ణు – మంచు మనోజ్ కుమార్ పరస్పరం గొడవ పడ్డారని పేర్కొంటూ ఓ వీడియో కూడా బయటకు వచ్చింది.
తూచ్.. అదంతా ఓ సినిమాటిక్ గొడవ.. అని తేల్చేశారు. ఏదో వెబ్ సిరీస్ అనీ, ఇంకోటేదో డాక్యుమెంటరీ అనీ.. ఏవేవో చెప్పి, ఆ గొడవని అలా చల్లార్చేశారు. ఇంట్లో పని చేసేవాళ్ళని కొట్టడం, ఇంట్లో దొంగతనాలు జరిగాయంటూ ఇంట్లో పని చేసేవాళ్ళ మీద కేసులు పెట్టడం.. ఇలా తరచూ మంచు కుటుంబం వార్తల్లోకెక్కుతూనే వుంటుంది.
ఇదిలా వుంటే, మంచు మనోజ్ కుమార్ పెళ్ళి వ్యవహారం, మంచు కుటుంబంలో రచ్చకు కారణమైందని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటినుంచీ గొడవలు జరుగుతూనే వున్నాయన్నది ఇంకో వాదన.
అధికారికంగా ఖండన ప్రకటన పీఆర్ టీమ్ నుంచి వచ్చింది గనుక, ప్రస్తుతానికి ఈ వివాదం ఇలా సద్దుమణిగినట్లే. కానీ, గొడవ నిజమేనంటూ సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం సంగతేంటి.?
మంచు మోహన్‌బాబు లేదా మంచు విష్ణు లేదా మంచు మనోజ్.. ఈ ముగ్గురిలో ఎవరైనా మీడియా ముందుకొచ్చి, ఈ ప్రచారానికి చెక్ పెడతారా.?
ఎంబీ యూనివర్సిటీ వ్యవహారాలపై విష్ణు – మనోజ్ మధ్య పంపకాలకు సంబంధించిన గొడవలు నడుస్తున్నాయన్న ప్రచారాల సంగతేంటి.? అన్నదమ్ముల మధ్య పంచాయితీని సెటిల్ చేసే క్రమంలో మంచు లక్ష్మికి ఇరువైపుల నుంచీ వాయింపులు ఎక్కువైపోయాయంటూ వినిపిస్తున్న ఊహాగానాల్లో వాస్తవమెంత.?
అయినా, క్రమశిక్షణకు మారు పేరు.. అని చెప్పుకునే మంచు కుటుంబంలో తరచూ ఇలా లుకలుకలు బయటపడుతుండడమేంటో.!
పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ కుమార్ గాయాలతో ఫిర్యాదు చేశాడంటూ ప్రముఖ మీడియా సంస్థల నుంచి బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చిన దరిమిలా, ఈ ఘటనపై మంచు కుటుంబం తరఫున పీఆర్ టీమ్ ఖండనని ఎలా చూడాలన్నది సినీ మీడియా వర్గాలకే అంతుబట్టని విషయంలా మారింది.