ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నానాటికీ మరింత దిగజారిపోతోంది. గత కొన్నాళ్ళుగా వైసీపీ క్యాడర్ అంతా, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న సంగతి తెలిసిందే.
వైసీపీ క్యాడర్, ఏపీ రాజకీయాల్ని వదిలేసి, తమిళనాడులో టీవీకే పార్టీ ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకుంది. సినీ నటుడు విజయ్ నేత విజయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా, ఆ ఘనతను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించేందుకు వైసీపీ క్యాడర్ పడరాని పాట్లూ పడుతోంది.
జగన్ వల్లనే విజయ్ గెలిచారు.. జగన్ తరహా పాలన అందించడానికే విజయ్ ప్రయత్నిస్తారు.. జగన్‌లానే విజయ్ డ్రెస్ వేసుకున్నారు.. అని వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఓ పనికిమాలిన నేరేటివ్‌ని బలవంతంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఈ ప్రచారం చూసి టీవీకే పార్టీ క్యాడర్ నవ్వుకుంటోంది. అసలు జగన్ ఎవరు? అన్న ప్రశ్న టీవీకే క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. అది వేరే చర్చ. అసలంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వదిలేసి, విజయ్ వెనకాల వైసీపీ ఎందుకు పడుతోంది.?
ఈ ప్రశ్నకు సమాధానంగా, వచ్చే ఎన్నికల్లో టీవీకే ఏపీలో కూడా పోటీ చేస్తుందనీ, టీవీకే పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందనీ కొందరు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇది అసలు జరిగే పనేనా.? ప్రస్తుతం టీవీకే విజయ్, కాంగ్రెస్ పార్టీ సాయంతో ముఖ్యమంత్రి పీఠమెక్కారు.
ఆ కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఏపీకి వచ్చి, ఎన్నికల ప్రచారం చేస్తే, కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల గెలుపు కోసమే అవుతుంది. అదే జరిగితే, ప్రస్తుతం విజయ్‌ని మోస్తోన్న వైసీపీ క్యాడర్ ఏమైపోవాలి?
నిజానికి, ఇదంతా పవన్ కళ్యాణ్ మీద అక్కసుతో, వైసీపీ విజయ్‌ని మోయడం తప్ప, విజయ్ మీద వైసీపీకి ప్రత్యేకమైన అభిమానం ఏమీ కొత్తగా పుట్టుకొచ్చేయలేదు.
