జనసేన – టీడీపీ పొత్తు నేపథ్యంలో, టీడీపీ నుంచి జనసేనకు ఆఫర్ చేసే సీట్లు కేవలం 38 మాత్రమేనట.! అలాగని, సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎవరు దీన్ని ప్రచారంలోకి తెచ్చారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మూడోవంతు సీట్లలో పోటీ చేస్తాం.. అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ‘వాళ్ళ వెనుక మనం నడవడంలేదు. కలిసి నడుస్తున్నాం. ఒకరు ఇచ్చే పరిస్థితి, ఇంకొకరు తీసుకునే పరిస్థితి వుండదు.. బలాల్ని బట్టి ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలన్నది కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాం.. అని కూడా జనసేనాని చెప్పడం చూశాం.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో జనసేన నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు, అధినేత పవన్ కళ్యాణ్‌తో మంతనాలు జరుపుతూనే వున్నారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఇతర ప్రజా ప్రతినిథులు జనసేనలో చేరుతున్న సంగతి తెలిసిందే.
పలువురు ఎమ్మెల్యేలూ జనసేనతో టచ్‌లో వున్నారు. ఈ క్రమంలో, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్న విషయమై జనసేనాని ఇప్పటికే ఓ ఖచ్చితమైన అభిప్రాయంతో వుండి వుంటారు. ఆయన ప్రకటించకముందే, సోషల్ మీడియాలో దుమారం.. దానికి కొందరు జనసేన మద్దతుదారులు జోడిస్తున్న అతి.. వెరసి, తప్పుడు సంకేతాలకు ఆస్కారమిస్తోంది.
నిజానికి, ఎన్నికలు సమీపించేసిన దరిమిలా, ఆలస్యం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. ఆ ఆలస్యంతోనే ఇన్ని సమస్యలు.! బీజేపీ కూడా తమ కూటమిలోకి వస్తుందని జనసేనాని ఆశిస్తుండడంతో, కీలక అంశాలపై నిర్ణయం ఆలస్యమవుతోందన్నది నిర్వివాదాంశం.
మొత్తంగా చూస్తే, 38 ప్లస్ అంటే చిన్న విషయమేమీ కాదు. అదే సమయంలో, గౌరవ ప్రదమైన సీట్లు.. అంటూ మూడో వంతు సీట్ల గురించి సంకేతాలిచ్చిన జనసేనాని, ఆ దిశగా కీలక ప్రకటన రానున్న కొద్ది రోజుల్లోనే చేస్తారా.? తొందరగా చేసేస్తేనే మంచిది.! లేదంటే, ఈ గాసిప్స్.. పొలిటికల్ ఈక్వేషన్స్‌ని ఎంతో కొంత దెబ్బ తీయొచ్చు.!