Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇది ఓ ప్రత్యేకమైన సినీ అనుభూతి అని చెబుతూ… నటన, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని వివరిస్తున్నాడు. మిగతా టెక్నీషియన్స్ కూడా ఇలానే చెప్పారు. సినిమా విశేషాలు చెప్పటం వేరు, ఎమోషనల్ గా అంచనాలు పెంచడం వేరు గా చూడాలని కొందరి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో మరో చర్చకు దారితీస్తోంది. సినిమా మీద నమ్మకం ఉండటం ఒకటి… కానీ అంచనాలను ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లడం మరోటి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా ఇలాంటి అతిపెద్ద హైప్ వల్ల దెబ్బతిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. విడుదలకు ముందు స్టేజీలపై, ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో “ఇండస్ట్రీ షేక్”, “చరిత్ర సృష్టి”, “ఎవరూ ఊహించని సినిమా” అంటూ మాట్లాడి… రిలీజ్ తర్వాత ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిలపడిన సందర్భాలు టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. అందుకే ఇప్పుడు “పెద్ది” విషయంలోనూ కొందరు అదే ప్రమాదాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇక్కడ చాలామంది ఉదాహరణగా Pushpa: The Rise, Pushpa 2: The Rule సినిమాలను ప్రస్తావిస్తున్నారు. బుచ్చి బాబు గురువు, దర్శకుడు Sukumar ఆ సినిమాల సమయంలో ఎక్కడా అతిగా మాట్లాడలేదు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పలేదు. సినిమాలు విడుదలయ్యాక కంటెంట్, క్యారెక్టర్స్, యాక్షన్, మ్యూజిక్, హీరో మేనరిజమ్స్ స్వయంగా మాట్లాడాయి. అలాగే S. S. Rajamouli లాంటి దర్శకులు కూడా సినిమాపై నమ్మకం ఉన్నా… “సృష్టిని మించిన అద్భుతం” అన్నట్టుగా మాట్లాడరు. ఆయన సినిమాల విషయంలో కూడా చివరికి ట్రైలర్, విజువల్స్, కంటెంట్‌నే మాట్లాడేలా చేస్తారు గానీ… మాటలతో ఆకాశానికెత్తరు.
ఇప్పుడు Peddi విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు “సినిమాకు సరైన ప్రమోషన్స్ లేవు” అనే విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలతో మొత్తం సీన్ మార్చేశాడు. సినిమా గొప్పదనం గురించి ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో విషయం చెబుతూ హైప్‌ను రోజురోజుకూ పెంచుతున్నాడు. దీనివల్ల అభిమానులు కూడా సహజంగానే అసాధారణ స్థాయి అంచనాలు పెట్టుకునే పరిస్థితి వస్తోంది.
ఇక ట్రైలర్ విడుదలకు ముందే కొంతమంది జర్నలిస్టులకు ప్రత్యేకంగా ట్రైలర్ చూపించడం, వారు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ముందుగానే హైప్ పోస్టులు వేయడం కూడా ఇండస్ట్రీలో గుసగుసలకు కారణమవుతోంది. “అందరికీ ఒకేసారి రావాల్సిన ట్రైలర్‌ను ఇలా ప్రత్యేకంగా చూపించడం సరైన పద్ధతి కాదు” అనే అభిప్రాయాలు మీడియా వర్గాలలో వినిపిస్తున్నాయి.
ఇటీవల పెద్ద హీరోల సినిమా ఈవెంట్లలో కూడా ఇలాంటి ఓవర్ ఎమోషనల్ ప్రమోషన్స్ చూసిన ప్రేక్షకులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూస్తున్నారు. ఒక దర్శకుడు స్టేజీపైనే ఏడవడం, ఒక నిర్మాత షర్ట్ విప్పి టీషర్ట్ చూపించడం, ఇంకో హీరో కాలర్ ఎగరేసి భారీ మాటలు చెప్పడం… ఇలా అతిగా చేసిన ప్రమోషన్స్ చివరికి సినిమాలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు “పెద్ది” ప్రమోషన్స్ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా గురించి “మేము బాగా తీశాం”, “ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పడం వరకు ఓకే. కానీ ప్రేక్షకుల ఊహలకు అందని స్థాయిలో మాటలు చెప్పడం మాత్రం ప్రమాదకరమే. ఎందుకంటే అభిమానులు ప్రతి మాటను నమ్మి అంచనాలు పెంచుకుంటారు. ఆ తర్వాత సినిమాలో చిన్నది మిస్ అయినా అదే హైప్ నెగెటివ్‌గా మారుతుంది. ఒకవేళ ఇది సినిమా ముందస్తు బిజినెస్ బాగా చేయాలనే లక్ష్యం అయితే గనుక కొంత వరకు ఓకే గాని.. మీ కంటెంట్ పై మీకు నమ్మకం ఉన్నప్పుడు అంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా ఇంకొద్దిసేపట్లో రిలీజ్ అయ్యే ట్రైలర్ వేదికపై … కంటెంట్ గురించి బుచ్చిబాబు గానీ, ఇంకెవరు గానీ కాదు… కంటెంట్ మాట్లాడాలి. అంటే వీళ్లు చూపించే ట్రైలర్ మాట్లాడుతుంది. ట్రైలర్‌నే మాట్లాడాలి కూడా. వీళ్లందరూ కాదు. అప్పుడే సినిమాకు మంచిది.
అయితే సినిమా కూడా వాళ్ళందరూ చెప్పినట్లే ఉండాలని, మంచి విజయం సాధించాలని అందరూ కోరుకుందాం.
