కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉండవల్లి నివాసంలో GNU సభ్యులతో మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడం కోసం GNU సుమారు 1300 కోట్ల రూ.లు పెట్టుబడి పెడుతుంది.
ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఎంప్లాయ్ మెంట్ లభిస్తుంది. ఏపీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్ధతుగా పెట్టుబడులు, సాంకేతికత, ఎక్విప్ మెంట్, ప్రణాళిక రూపకల్పన విషయంలో GNU బలాలను ఉపయోగించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం వల్ల మన విద్యార్ధులకు ప్రపంచస్థాయి విద్య అందుతుంది.. ఏపీ విద్యారంగాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీల ద్వారా ఆంద్రప్రదేశ్ లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా వరల్డ్ ఎంప్లాయ్ మార్కెట్ లో విజయం సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందుతాయని అన్నారు. గ్లోబల్ లీడర్లుగా ఏపీ విద్యార్ధులను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం చిత్తశుద్ధి అని దానికి ఈ ఒప్పందమే నిదర్శనమని అన్నారు నారా లోకేష్.