ఓ ఎమ్మెల్యే తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడానికే ఇష్టపడకపోతే.? ఆ ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక అర్హత లేనట్టే. అలాంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్ మీదనే వుంటుంది.
అసెంబ్లీకి హాజరు కాకపోతే, శాసన సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం వుంది.. అలా జరిగితే, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావొచ్చు.. అని తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
‘నువ్ రాజీనామా చెయ్ జగనన్నా.. పులివెందులలో ఉప ఎన్నిక వస్తే, బంపర్ మెజార్టీతో మళ్ళీ గెలుద్దువ్.. ఆ ప్రభంజనం రాష్ట్రమంతా వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఇస్తుంది..’ అని వైసీపీ క్యాడర్ కూడా ఒకింత అత్యుత్సాహం చూపుతోంది సోషల్ మీడియా వేదికగా.
వైసీపీ కార్యకర్తల మనోభావాలకు గౌరవమిచ్చే వ్యక్తే అయితే, వైఎస్ జగన్ ఎప్పుడో రాజీనామా చేసి వుండేవారే. అంతే కదా మరి.. అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదు. ‘అసెంబ్లీకి వెళితే మాత్రం, నాకు మైక్ ఇస్తారా..?’ అని తాజాగా ఇంకోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ప్రతినిథులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.. తనదైన స్టయిల్లో.
ఇదేం పద్ధతి.? అసెంబ్లీలో వున్న 175 మంది సభ్యులకూ మాట్లాడే సమయం దొరుకుతుంది. అందులో ఒకరేమో స్పీకర్. మిగతా 174 మంది సభ్యులకు, వారి వారి హోదాని బట్టి, సమయం దొరుకుతుంది. మంత్రులకు ఒకలా, సాధారణ ఎమ్మెల్యేలకు ఇంకోలా.
వైసీపీకి ప్రతిపక్ష హోదా గనుక దక్కి వుంటే, అది మళ్ళీ వేరే చర్చ. అప్పుడు కూడా, సమయం.. పరిమితంగానే వుంటుంది.. ఎందుకంటే, వైసీపీ సాధించిన సీట్లు జస్ట్ 11 మాత్రమే. గతంలో వైసీపీ ఏం చేసిందో, ఇప్పుడు టీడీపీ కూడా అదే పద్ధతిని అసెంబ్లీలో ఫాలో అవుతుంది మరి.
తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గురించి జగన్ తాను చెప్పిన లెక్కల్ని ఇప్పుడు, ఇంకోసారి ఇంకాస్త సరిగ్గా లెక్కలేసుకుంటే, అసలు జగన్ అనే వ్యక్తి, ప్రతిపక్ష హోదా అడిగే పరిస్థితే రాదు.
ఎటూ అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశ్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదు గనుక, పులివెందుల ఎమ్మెల్యే పదవికి ఆయనే గౌరవంగా రాజీనామా చేస్తే మంచిది. అసెంబ్లీకి జగన్ వెళ్ళకపోతే, ఆయన మీద అనర్హత వేటు పడితే.. అది అవమానకరమైన వ్యవహారమే అవుతుంది. జగన్ రాజకీయ జీవితంలో, అదో మచ్చగా మారిపోతుంది కూడా.