జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.!
కానీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ మహిళా డాన్సర్‌ని లైంగికంగా వేధించారనడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ తెరపైకొస్తోంది. సినీ పరిశ్రమలో జానీ మాస్టర్‌కి క్లీన్ ఇమేజ్ వున్న మాట వాస్తవం. జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో ఆయనా ఒకరు. అంతే కాదు, డాన్సర్స్ యూనియన్ అధ్యక్షుడిగానూ తెలుగు సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల ఆయనకు కొరియోగ్రాఫర్‌గా జాతీయ పురస్కారమూ దక్కింది.! తెలుగుతోపాటు తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో కొరియోగ్రాఫర్‌గా బిజీగా వున్నారు జానీ మాస్టర్.
జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను దూరంగా వుంచుతూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కూడా.
సాధారణంగా, ఇలాంటి విషయాల్లో పార్టీలు అంత వేగంగా స్పందించవు. కానీ, జనసేన పార్టీ స్పందించింది. ప్రస్తుతానికి జానీ మాస్టర్ మీద వచ్చింది ఆరోపణ మాత్రమే. అందిన ఫిర్యాదు నేపథ్యంలో విచారణ ప్రారంభిస్తామనీ, ఆధారాల్ని సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.
జానీ మాస్టర్ జనసేన నేత కావడంతో, సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తూ, జనసేన పార్టీని ట్రోల్ చేస్తూ వైసీపీ పెయిడ్ బ్యాచ్ పైశాచికానందం పొందుతోంది. నిజానికి, సినీ పరిశ్రమలో ఈ తరహా ఆరోపణలు తరచూ వెలుగు చూస్తుంటాయి. వాటిల్లో చాలావరకు ఫేక్ ఆరోపణలుగానే మిగిలిపోతుంటాయి.
జానీ మాస్టర్ తప్పు చేసి వుంటే, ఆయన తప్పించుకునేందుకు అవకాశమే వుండదు. పార్టీ పరంగా మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుకంజ వేయరు.