ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆరోపణలు కూడా వస్తున్నాయి.
తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి శ్రీ కుమార్ విశ్వజిత్ తో చర్చలు జరిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలంటూ మంత్రి దుర్గేశ్ ఆదేశాలు జారీ చేశారు.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏకమై ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడంపై పూర్తి స్థాయి వివరాలు అందజేయాలన్నారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోతుందనే విషయాలపై కూడా వివరణ ఇవ్వాలని సూచించారు.
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు ఓ నలుగురు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారనే రూమర్లు, వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి దుర్గేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది. రేపు నిర్మాతల సమావేశం ఉంది. అందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
