ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉంటుంది. ప్రతీసారి ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు అభిమానులకు కచ్చితంగా పండగే. టి20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్తాన్ జట్లు ఈరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఉన్నన్ని ట్విస్ట్ లు ఏ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ చిత్రంలో ఉండవంటే అతిశయోక్తి కాదు.
టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. అర్షదీప్ సింగ్ తన స్వింగ్ తో మాయ చేసి ఓపెనర్లు ఇద్దరినీ తన బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత పాకిస్తాన్ మళ్ళీ పుంజుకుంటున్న క్రమంలో హార్దిక్ పాండ్య, షమీ, భువి, అర్షదీప్ లు కంట్రోల్ చేయడంతో ఒక దశలో పాకిస్తాన్ 140 అయినా చేరుకుంటుందా అనిపించింది. అయితే వారి లోయర్ ఆర్డర్ కు తోడు ఇఫ్తికార్, షాన్ మసూద్ లు రాణించడంతో 159 పరుగులు చేసింది.
ఇక ఛేజింగ్ లో రాహుల్, రోహిత్ ల వికెట్లు చాలా త్వరగా కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత సూర్యకుమారి యాదవ్ రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించినా హారిస్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. అక్షర్ పటేల్ కూడా రనౌట్ కావడంతో 30 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పరాజయం ముంగిట నిలిచింది.
అయితే హార్దిక్ తో కలిసిన విరాట్… సింగిల్స్, డబుల్స్ తో ఇన్నింగ్స్ ను నిర్మిస్తూ అవకాశం చిక్కినప్పుడు బౌండరీ బాదుతూ సెంచరీ పార్ట్నర్షిప్ దాటించాడు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా హై డ్రామానే నడిచింది. మొత్తానికి 1 బంతికి 1 పరుగు కావాల్సిన టైమ్ లో అశ్విన్ కూల్ గా సింగిల్ కొట్టడంతో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 53 బంతుల్లో 82 పరుగులు చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.