వన్డే వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా గెలిచింది. అదీ ఆరోసారి.! టీమిండియా సొంత గడ్డపై, ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం (ప్రేక్షకుల పరంగా) అని చెప్పుకునే స్టేడియంలో.. అదీ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో.. అందునా, నరేంద్ర మోడీ పేరుతో నూతనంగా నిర్మించబడిన స్టేడియంలో.. టీమిండియాకి చేదు అనుభవం ఎదురైంది.
ఎప్పుడూ వన్డే వరల్డ్ కప్ అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనదే.! ఈసారి మరింత ప్రత్యేకం.! ఎందుకంటే, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా ఫైనల్‌కి చేరుకుంది. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, టైమ్ బ్యాడ్.. టీమిండియా ఓడిపోయింది.
అశ్విన్‌ని తీసుకుని వుంటే బావుండేది.. సూర్యకుమార్ యాదవ్ దండగ.. శ్రేయస్ అయ్యర్ చెత్త ఆట ఆడాడు.. ఇలా బోల్డన్ని విశ్లేషణలు. కానీ, వీళ్ళందరూ, ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా గెలవడానికి దోహదపడ్డారు.
నిజానికి, ఇంత స్ట్రాంగ్‌గా టీమిండియా ఎప్పుడూ లేదు. వాస్తవానికి, ఆస్ట్రేలియా మరీ అంత స్ట్రాంగ్‌గా కనిపించలేదు ఫైనల్‌కి ముందు. కానీ, ఫైనల్‌లో ఆస్ట్రేలియా నిలబడింది, టీమిండియా తడబడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా తడబడితే, ఆ మూడు విభాగాల్లో ఆస్ట్రేలియా సత్తా చాటింది.
గతంలో ఓ సారి వరల్డ్ కప్‌ని ఆస్ట్రేలియా చేతిలోనే చేజార్చకున్నాం. ఇప్పుడిది ఇంకోసారి.! అదే, భారత క్రికెట్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్న విషయం. అంతిమంగా, ఇదొక గేమ్.! ఆట అన్నాక గెలుపోటములు సహజం. కాకపోతే, అన్ని మ్యాచ్‌లు గెలిచి, ఫైనల్‌కి వచ్చాక ఓడిపోవడం.. దీన్ని తట్టుకోవడం కష్టమే.!
మ్యాచ్ చూస్తున్న క్రికెట్ అభిమానులకే ఇలా వుంటే, రోజుల తరబడి, నెలల తరబడి ఈ టోర్నీ మీద ఆశలు పెట్టుకున్న భారత క్రికెటర్ల పరిస్థితి ఏంటి.?