రో’హిట్‌’: నరాలు తెంచేసి.. మ్యాచ్‌ని గెలిపించేసి.!

రో’హిట్‌’: నరాలు తెంచేసి.. మ్యాచ్‌ని గెలిపించేసి.!

రోహిత్‌ శర్మని హిట్‌ మ్యాన్‌గా ఎందుకు అభివర్ణిస్తాం.? ఎందుకంటే, బంతిని అంత బలంగా కొడతాడు మరి.! టీమిండియాలో బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి కొట్టే మొనగాళ్ళు చాలామందే వున్నా, రోహిత్‌ శర్మ చాలా చాలా స్పెషల్‌. ప్రపంచ క్రికెట్‌లో ఎంతటి స్ట్రాంగ్‌ బౌలర్‌ అయినాసరే.. రోహిత్‌ శర్మ అస్సలేమాత్రం భయపడడు. భయానికి మీనింగే తెలియని నేచర్‌ అతనిది. అదే అతన్ని ప్రపంచ క్రికెట్‌లోనే హిట్‌ మ్యాన్‌గా మార్చింది.

ఆ హిట్‌ మ్యాన్‌.. న్యూజిలాండ్‌తో ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకి విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెల్చుకున్న టీమిండియా, మూడో మ్యాచ్‌లోనూ అదే జోరు ప్రదర్శించింది. అయితే, అనూహ్యంగా న్యూజిలాండ్‌ పుంజుకుంది. 179 పరుగులు టీమిండియా చేస్తే, కేన్‌ విలియమ్సన్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌ కూడా 179 పరుగులే చేసింది. మ్యాచ్‌ టై అవడంతో, సూపర్‌ ఓవర్‌ షురూ అయ్యింది.

మళ్ళీ కేన్‌ విలియమ్సన్‌ రంగంలోకి దిగాడు.. ఫలితంగా న్యూజిలాండ్‌ ఒకే ఓవర్‌లో 17 పరుగులు చేసింది. 18 పరుగుల లక్ష్యంతో టీమిండియా మళ్ళీ బరిలోకి దిగింది. రోహిత్‌ శర్మ, కె.ఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌కి దిగారు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు సాధించాల్సి వుంది. రోహిత్‌ శర్మ బ్యాట్‌ ఝుళిపించాడు.. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు భారీ సిక్సర్లు బాదాడు. అంతే, టీమిండియా బంపర్‌ విక్టరీ కొట్టింది.

నిజంగానే నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన మ్యాచ్‌ ఇది. ఓ దశలో మ్యాచ్‌ చేజారిపోతుందని భారత క్రికెట్‌ అభిమానులు అనుకున్నారు. ఆ స్థాయిలో కేన్‌ విలియమ్సన్‌ అదరగొట్టేశాడు. 20 ఓవర్ల మ్యాచ్‌లో చివరి ఓవర్‌ వేసిన షమీ అదరగొట్టేశాడు. దాంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. షమీ, చివరి ఓవర్‌లో సత్తా చాటితే, రోహిత్‌ శర్మ.. 20 ఓవర్లలో బ్యాటింగ్‌తోనే కాదు, సూపర్‌ ఓవర్‌లోనూ దుమ్మురేపాడు.

మొత్తమ్మీద, ఈ విజయంతో టీమిండియా, న్యూజిలాండ్‌పై సిరీస్‌ విజయాన్ని నమోదు చేసింది. మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి వుండగానే ఈ ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. ఏమో, క్లీన్‌ స్వీప్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మెన్‌ ఇన్‌ బ్లూ.