విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని దేవాడ మైనింగ్ బ్లాక్‌లో అనుమతించిన పరిమితికి మించి మాంగనీస్ తవ్వకాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి.
ఏడాదికి 10 లక్షల టన్నుల మాంగనీస్ తవ్వాలని అనుమతులు ఉన్నప్పటికీ, అంతకుమించి తవ్వకాలు జరుగుతున్నాయని, అలాగే ఈ మైనింగ్ బ్లాక్ ఈ-వేలంలోనూ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ వేలం జరిగిందనీ, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోలేదని తెలిపారు.
ఈ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు గమనించి, పూర్తి వివరాల నివేదికను ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు. అనుమతుల విధానం, ఈ-వేలం ప్రక్రియ, ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాల వివరాలు సమర్పించాలని కోరారు.
దేవాడ మైనింగ్ లో జరుగుతున్న తవ్వకాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని, విజయనగరం జిల్లా అధికారులతో పవన్ కల్యాణ్ కార్యాలయం చర్చించింది. ఆయన కోరిన సమాచారం త్వరగా ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి స్పష్టం చేశారు.
