పహల్గాం ఉగ్రాదాడి తర్వాత కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతగా పాకిస్థాన్ మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పహల్గామ్ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన పార్టీ. ఇందులో అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పహల్గాం దాడి పట్ల కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నాం మేమంతా వారి వెంటే ఉంటాం. అక్కడ కేవలం మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు. దీన్ని మాట్లాడుతుంటే కొందరు అలా మాట్లాడొద్దు అంటున్నారు. ఎందుకు మాట్లాడొద్దు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నా ఉద్దేశం.
ఇలాంటి టైమ్ లో కూడా కొందరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారు. సోకాల్డ్ సెక్యులర్లు పాకిస్థాన్ ను ప్రేమిస్తాం అంటున్నారు. అంత ప్రేమ ఉంటే పాకిస్థాన్ కు వెళ్లిపోండి. ఈ దేశంలో ఎందుకు ఉంటున్నారు. పాకిస్థాన్ ఇస్లామిక్ దేశం. కానీ భారత్ హిందూ దేశంగా చెప్పలేం. ఇక్కడ అన్ని మతాల వారికి స్వేచ్ఛ ఉంది. పాకిస్థాన్ లో ఎంత మంది ముస్లింలు ఉన్నారో మన దగ్గర కూడా అంతే మంది ఉన్నారు. అలా ఉన్నారు అంటే ఈ దేశంలో మత పరమైన వివక్ష లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాం. జనసేనలో ఎంతో మంది ముస్లిం నాయకులు ఉన్నారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే ముందు గొంతు ఎత్తేది నేనే. కానీ మతం సమస్య కన్నా దేశం సమస్యగా అందరం చూడాలి. ఎక్కడో కశ్మీర్ లో దాడి జరిగితే మనకెందుకు అనుకోవద్దు.
దాని ప్రభావం అందరిపై ఉంటుంది. పహల్గాంలో దాడి జరిగితే జనసేన నేత చనిపోయాడు. అంటే దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. టూర్ కు వెళ్తే చంపేస్తుంటే ఇంక ఏం చేయాలి. మనకు సహనం ఎక్కువ అయిపోయింది. ఇన్ని దాడులు చేస్తున్న టెర్రరిస్టులను ఎందుకు వదిలేయాలి. ఎందుకు చంపకూడదు. మధుసూదన్ గారి భార్య చెప్పే మాటలు వింటే కన్నీళ్లు ఆగట్లేదు. నేను బొట్టు పెట్టుకుంటే గుర్తుపట్టి చంపేశారు అని చెబుతోంది. ఉండాల్సిన ముఖమే లేకుండా కాల్చి చంపేశారు. అత్యంత క్రూరంగా 32 బుల్లెట్లు ముఖం మీద దింపేశారు. తలచుకుంటేనే బాధేస్తుంది. ఒక నమ్మకాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అందుకే ప్రతి దానిపై జనసేన మాట్లాడుతుంది. జనసేనది జాతీయ నినాదం. దేశం కోసం ఆలోచిస్తుంది ఈ పార్టీ.
టెర్రరిస్టులు కాల్చి చంపేస్తుంటే మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కానీ కొందరు మీరెందుకు మాట్లాడుతున్నారు. కొందరి ఓట్లు పోతాయి అంటున్నారు. నేను ఓట్ల కోసం రాజకీయాల్లోకి రాలేదు. మార్పు కోసం వచ్చాను. అందుకే కచ్చితంగా నిజమే మాట్లాడుతాను. ఇన్నేళ్ల తర్వాత కూడా నిజం మాట్లాడకపోతే ఎలా. కాంగ్రెస్ లోచాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకమైపోయాయి. దేశ భద్రత కోసం కేంద్రానికి మద్దతు పలుకుతున్నాయి. జనసేన కూడా అందులో ఉంది. మధుసూదన్ గారి కుటుంబానికి రూ.50లక్షలు విరాళంగా పార్టీ అందజేస్తుంది. ఇదే కాకుండా మున్ముందు అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరింత సాయం అందేలా చూస్తాను. ఇలాంటివి జరగకుండా చేసే బాధ్యత కేంద్రానికి ఉంది. వారికి అందరం అండగా ఉందాం అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
