నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ అలాంటిదే.!
అయితే, లోకేష్ సీఎం అవ్వాలని టీడీపీ శ్రేణులు కోరుకున్నా, అందులో తప్పు లేదు. కానీ, ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని టీడీపీ నేతలు, శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తుండడమే అసలు సమస్య. అసలంటూ రాజకీయాల్లో లేని చిరంజీవిని కూడా కొన్ని టీడీపీ హ్యాండిల్స్ వివాదంలోకి లాగుతున్నాయి.
దాంతో, ఇరు పార్టీలకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ మధ్య గలాటా తారాస్థాయికి చేరుతోంది. ఇది రెండు పార్టీలకూ మంచిది కాదు. అటువైపు వైసీపీ, అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ ముసుగేసుకున్న కొందరు వైసీపీ కోవర్టులు, టీడీపీ – జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి.
నిజానికి, నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వచ్చిన నష్టమేమీ లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వున్నా, డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చారు పవన్ కళ్యాణ్. కీలక నిర్ణయాల విషయంలో, స్వేచ్ఛగా పవన్ కళ్యాణ్ వ్యవహరించగలుగుతున్నారు.
నారా లోకేష్ కూడా తన శాఖల విషయంలో ఇలాగే వ్యవహరించే స్వేచ్ఛని కలిగి వున్నారు. ఇతర మంత్రులదీ ఇదే పరిస్థితి. రాజ్యాంగంలో అయితే ఉప ముఖ్యమంత్రి.. అన్న పదవికి అదనపు గౌరవాలు, వెసులుబాట్లు ఏమీ లేవు. మంత్రులతో సమానమే ఉప ముఖ్యమంత్రి పదవి కూడా.
గతంలో పలువురు ఉప ముఖ్యమంత్రులుగా పని చేసినా, పన్ కళ్యాణ్ వల్లనే ఉప ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం వచ్చింది. అలాగే నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి అయితే, ఆయనా ఆ పదవికి గౌరవం వచ్చేలా పని చేయాల్సి వుంటుంది. ఇంకో ఉప ముఖ్యమంత్రి అవసరమనుకుంటే, చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. అది కూడా, కూటమిలో చర్చించిన తర్వాతే.!