నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో చంద్రబాబు మాట్లాడారు. ఒకప్పుడు ప్రపంచంలోని అగ్ర దేశాల్లో మన తెలుగువారు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు అన్ని దేశాల్లో తెలుగు వాళ్లు రాణిస్తున్నారు.
భవిష్యత్ లో తెలుగువాళ్లకు అనేక రకాల అవకాశాలు వస్తాయి. రాజకీయంగా తెలుగు వాళ్లకు ఇప్పుడు మంచి గుర్తింపు లభిస్తోందని చంద్రబాబు అన్నారు. నా రాజకీయ జీవితంలో యువతనే ఎక్కువగా ప్రోత్సహించానన్నారు. నేను జైలుకు వెళ్లినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు నాకోసం 53 రోజులు ఫైట్ చేశారు. ఆ రోజులు నా జీవితంలో మర్చిపోలేను. అర్హతలేని వ్యక్తి సీఎంగా ఉంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్లు చూశామని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్ లో ఉపయోగించబోయే టెక్నాలజీని ముందే మన తెలుగు వారికి అందించేందుకు తాను నిత్యం కృషి చేస్తానని.. గతంలో ఐటీని ఎవరూ నమ్మని రోజుల్లోనే హైదరాబాద్ కు తెచ్చినట్టు గుర్తు చేసుకున్నారు.
ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని.. తెలుగు యువతకు అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. జీతాలు ఇచ్చే స్థాయిలో తెలుగు ప్రజలను నిలబెట్టేందుకు తాను ఎళ్లవేళలా కృషి చేస్తానని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.