‘నాన్నతో వెళ్తాను..’ అని ఆద్య అడగ్గానే, ‘వెళ్ళమని’ రేణు దేశాయ్ పంపించారట.. అదీ, పవన్ కళ్యాణ్ దగ్గరకి. పవన్ కళ్యాన్ – రేణు దేశాయ్‌ల వైవాహిక బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు.. అందులో ఒకరు అకిరానందన్ కాగా, ఇంకొకరు ఆద్య.. ఇవి అందరికీ తెలిసిన విషయాలే.
వైవాహిక బంధంలో మనస్పర్ధల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ విడిపోయారు. విడాకులు తీసుకున్నా, తమ పిల్లలకు మంచి పేరెంట్స్‌గానే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వుంటున్నారు. అయితే, అప్పుడప్పుడూ రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం మామూలే. అది కూడా సోషల్ మీడియా వేదికగానో, ఆయా ఇంటర్వ్యూల్లోనే. కారణం ఏంటన్నది వేరే చర్చ.
అయితే, రేణు దేశాయ్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌ని అభినందిస్తూ వచ్చారు, రాజకీయంగా ఆయన్ని సమర్థిస్తూ వచ్చారన్నదీ కాదనలేని వాస్తవం. పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై, రాజకీయ ప్రత్యర్థులు అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేయడం, ఈ క్రమంలో రేణు దేశాయ్ సైతం నొచ్చుకోవడం తెలిసిన విషయాలే.
ఇవన్నీ పక్కన పెడితే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వద్దకు ఆద్యను పంపించారు రేణు దేశాయ్. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అధికారిక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అధికారుల నుంచి గౌరవ వందనాన్ని అందుకోవడం, అలాగే జెండా వందనం చేయడం జరిగింది.
కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆద్య సందడి చేయడం గమనార్హం. తండ్రితో కలిసి ఆద్య సెల్ఫీ తీసుకున్న వైనం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే ఫొటోని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కోసం క్షణం తీరిక లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్న తన తండ్రి పవన్ కళ్యాణ్‌ని చూసి ఆద్య చాలా విషయాలు నేర్చుకుందని రేణు దేశాయ్ పేర్కొనడం గమనార్హం.