సినీ నటుడు, కమెడియన్ హైపర్ ఆదికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాణ హాని పొంచి వుంది. వైసీపీ కార్యకర్తలు, హైపర్ ఆదిని చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఎందుకిదంతా.? 2024 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున చాలా యాక్టివ్‌గా వున్నాడు హైపర్ ఆది. అంతకు ముందు కూడా, జనసేన పార్టీకి సంబంధించిన బహిరంగ సభల్లో హైపర్ ఆది సందడి చేశాడు. అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో కామెడీ పంచ్‌లు పేల్చాడు.
అసలు విషయం అది కాదు. జనసేన కీలక నేత నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో, ‘పదకొండు’ చుట్టూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమెడియన్ హైపర్ ఆది.
పదకొండుకీ, వైసీపీకి సంబంధమేంటో తెలుసు కదా.? వైసీపీ ఇటీవలి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.. అదీ మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి పదకొండే ఆ పార్టీ గెలవడంతో, వైసీపీ శ్రేణులు ఎక్కడ ‘పదకొండు’ నంబర్ గురించిన ప్రస్తావన వచ్చినా ఉలిక్కిపడుతున్నారు.
సినిమాల్లో 11 మంది కుర్రాళ్ళున్నారనీ, పదకొండు మంది క్రికెటర్లు భారతదేశానికి వరల్డ్ కప్ అందించారనీ, ఆ పదకొండు గురించి చెప్పుకోవాలంటే చాలా వుందనీ కమెడియన్ హైపర్ ఆది చెప్పాడు.
హైపర్ ఆది మంచి రచయిత కూడా. పంచ్ డైలాగులు బాగా రాస్తాడు. వాటిని ఇంకా బాగా పేల్చుతాడు కూడా. సహజంగానే రచయిత గనుక, సినిమా వేదికలపై ప్రాసతోకూడిన మాటలు, అది కూడా టైమింగ్‌తో కూడిన డైలాగులు చెబుతాడు.
దాన్ని వైసీపీ కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. ‘పదకొండు’ గురించి చెబుతూ వైసీపీని అవమానిస్తావా.? నీ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ‘2029లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు.. హైపర్ ఆదిని మాత్రం వదలొద్దు జగనన్నా..’ అని కొందరు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ హెచ్చరికలకు దిగుతున్నారు.