అన్షు, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు పిట్టలు’ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఫిలింస్ విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
తాజాగా విడుదలైన ‘మంగళస్నానం’ పాట తండ్రి–కూతురు మధ్య ఉన్న ఆప్యాయమైన అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తోంది. ఓ తండ్రి తన కూతురిని ఎంత ప్రేమగా పెంచుకుంటాడో, ఆమె కోసం ఎంతగా ఆలోచిస్తాడో ఈ గీతం ద్వారా తెలియజేశారు. భావోద్వేగాలతో నిండిన ఈ పాటకు ఎస్.ఎస్. చిరంజన్ సాహిత్యం అందించగా, యోగి సురేష్, విహా ఆలపించారు. సంగీతాన్ని చరణ్-అర్జున్ సమకూర్చారు. మెలోడీతో పాటు భావప్రధానత కలిసిన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, తండ్రి–కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన పాట ఇదన్నారు. యువతీ యువకులు మరియు వారి తల్లిదండ్రులు కలిసి చూడదగిన కుటుంబ కథా చిత్రం ఇదని చెప్పారు. తన జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించానని తెలిపారు. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు థ్రిల్ అవుతారని, మంచి సందేశంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్మాత మాట్లాడుతూ, ఫస్ట్ హాఫ్ యూత్‌ఫుల్‌గా సాగుతుందని, సెకండ్ హాఫ్‌లో మెచ్యూర్డ్ కంటెంట్ ఉంటుందని చెప్పారు. యువతకు, తల్లిదండ్రులకు ఆలోచింపజేసే అంశాలను దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో చూపించారని పేర్కొన్నారు. నటీనటుల సహజ నటన సినిమాకు ప్రధాన బలం అవుతుందని, ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
అన్షు, వాసవి గణేషన్, గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హుషారు పిట్టలు’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: చరణ్-అర్జున్.
