రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది.. బెల్టు షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయ్.. ప్రజలు ఈ పరిస్థితులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు..
వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఇవి.! నిజమే, ఎవరైనాసరే.. మద్యాన్ని సమర్థించకూడదు. కాకపోతే, ప్రభుత్వాలకి మద్యమే ప్రధాన ఆదాయ వనరు అయి కూర్చుంది. ఈ విషయాన్ని వైఎస్ జగన్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో వున్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.
‘ప్రతిపక్షం, సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవకూడదని కోరుకుంటోంది.. మద్యం ద్వారా రాష్ట్రానికి ఆదాయం రాకూడదని కోరుకుంటోంది..’ అని జగన్ సెలవిచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఎవరైనా ఈ మాట అంటే ఫర్లేదు, జగన్ మాత్రం అనకూడదు. ఎందుకంటే, మద్య నిషేధం.. అంటూ 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది ఆయనే. మేనిఫెస్టోలో కూడా మద్య నిషేధం అంశాన్ని ప్రస్తావించారు.
మద్య నిషేధం అన్నారు, దశలవారీగా మద్య నిషేధం అన్నారు.. చివరికి మద్య నియంత్రణ.. అని బుకాయించారు. అదీ వైసీపీ తీరు.!
మద్యంపై ఇంతలా ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వైసీపీ, మొన్నటి మద్యం దుకాణాల టెండర్ల విషయంలో పోటీ పడింది. వైసీపీ నాయకులు, వారి అనుచరులు పెద్దయెత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు. మద్యం విషయంలో వైసీపీ చిత్తశుద్ధి ఇదీ.
వైసీపీ హయాంలో మద్యం రేట్లు ఆకాశాన్నంటాయ్.. అదే సమయంలో, కల్తీ మద్యం ఏరులై పారింది. ఈ నేపథ్యంలో మద్యం మరణాలు కనీ వినీ ఎరుగని రీతిలో చోటు చేసుకున్నాయి. మద్యానికి బానిసైన తమవారిని కోల్పోయిన కుటుంబాలు, మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశాయన్నది నిర్వివాదాంశం.
ఇదంతా వైసీపీకి తెలియంది కాదు.! వైసీపీ నేతలు, మద్యం గురించి ఇప్పుడు మాట్లాడుతోంటే, వైసీపీ హయాంలో మద్యం దారుణాలు జనాలకి గుర్తుకొస్తున్నాయ్. అందుకే, మద్యం విషయమై వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే ఆ పార్టీకి అంత మంచిది.! సాక్షాత్తూ జగన్ మోహన్ రెడ్డికే వైసీపీ హయాంలో ‘జె ట్యాక్స్’ రూపంలో మద్యం నుంచి వేల కోట్ల రూపాయలు వెళ్ళాయన్న ఆరోపణలూ వున్నాయ్ మరి.